
2-KRISHNA SASTRY SAHITHYAM - BADARIKA PALLAKI
₹70
In stock · 2 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట కృష్ణశాస్త్రిగారు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయనే ఎక్కడో ఎప్పుడో ప్రస్తావించిన దృశ్యం నా మనస్సులో బొమ్మ కడుతుంది. కవిత్వం రాయటం ప్రారంభించిన తొలిరోజుల్లో, అంటే డెబ్బై ఏళ్ళ క్రితం, ఒక అర్ధరాత్రి సామర్లకోట ప్లాట్ఫాం మీద ఈయనా, నండూరి సుబ్బారావు తారసపడ్డారట. నువ్వేం రాస్తున్నావు? అంటే, నువ్వేం రాస్తున్నావు? అని కుశల ప్రశ్నలు వేసుకొని, ఒకరి గేయా లొకరికి వినిపించి, సుబ్బారావు రైలు ముందురాగా, ఆయన్ని రైలెక్కించి, తన రైలుకోసం ప్రతీక్షిస్తూ దీపస్తంభపు క్రీనీడలో పిట్టలాగా ముడుచుకు కూచున్నానని రాశారు కృష్ణశాస్త్రిగారు. ఒంటరితనంతో బరువెక్కిన ఈ చిత్రం ఆనాటి కృష్ణశాస్త్రికి ప్రతీకగా నాకు తోస్తుంది. ప్రతి మనిషీ తన అస్తిత్వ కేంద్రంలో ఒక మహాశూన్యంతో పుడతాడు. ఆ శూన్యాన్ని బహిఃప్రపంచంతో, ప్రాపంచిక సౌందర్యంతో, తత్ఫలితమైన ఆనందంతో నింపగలిగే శక్తి, సాధనా బహుకొద్దిమంది సృజనకారులకు ఉంటుంది. మానవ జన్మకు శాపమైన ఆ శూన్యాన్ని కృష్ణశాస్త్రిగారు అద్భుత, సౌందర్యమయ ప్రపంచంతో నింపారు. ఆత్మస్వేచ్ఛకీ, సృజన శక్తికీ ప్రతీక అయిన ఊర్వశిని ఆ శూన్యంలో నిలిపారు. ఈ తపస్సూ, అన్వేషణా ఒకనాటివి కావు. 'కృష్ణపక్షం'లో ప్రకృతితో తాదాత్మ్యంతో మొదలై, ఆత్మకీ, స్వేచ్ఛకీ, అద్వైతాన్ని తెలుసుకుని, సౌందర్యాన్వేషణలో పండి, ప్రేమకై తపించి, విరహాగ్నిలో కాగి, లోకం చేత నిరసింపబడి, ఆత్మదైన్యంతో క్రుంగి: తరవాతి కావ్యమైన 'ప్రవాసం'లో అన్వేషణ తీవ్రతరం కాగా, దుఃఖంతో నిర్వేదంతో ఐక్యం చెంది, చివరికి 'ఊర్వశి' కావ్యంలో స్వేచ్ఛకీ, సౌందర్యానికీ, ప్రేమకీ, కవి సృజనశక్తికీ సంశ్లేషమూర్తియైన ఊర్వశిని సాక్షాత్కరింప చేసుకున్నారు. తనలోని మౌలిక శూన్యాన్నించి కృష్ణశాస్త్రి సాగించిన ఈ అన్వేషణ, దుఃఖమూ, నిర్వేదమూ సాధనాలుగా, చివరికి ఊర్వశీ మూర్తిని అందుకుంది. ★ ★ కృష్ణశాస్త్రిగారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకి సంబంధించినది. రెండోది ఆలోచనకీ, వ్యక్తిత్వానికీ సంబంధించింది. తెలుగు భాషా, దాని నుడికారపు సొంపులూ తరతరాలుగా ఆయన వంశీయుల రక్తంలో జీర్ణమై పోయాయి. నాలుగు వందల యేళ్ళనించి వారి పూర్వీకులు పిఠాపురం సంస్థాన కవులూ, పోషితులునూ, వారి నాన్నగారు తమ్మన్న శాస్త్రిగారూ, పెదనాన్నగారు సుబ్బరాయశాస్త్రిగారు గొప్ప పండితులూ, కవులూ. వారివద్ద స్వయంగా భారత, భాగవతాదులూ, ప్రబంధాలూ చదువుకున్నారీయన. శాస్త్రిగారికి ఇష్టతముడైన కవి నన్నయ్యభట్టు. తరవాత తిక్కన. ఆ తరువాత రామకృష్ణుడు. శబ్దప్రయోగం, కవిత్వశైలుల విషయంలో ఈయన నన్నయనించి నేర్చుకున్నది చాలా ఎక్కువ. "శబ్దానికి ప్రాణమే కాదు, పక్షాలూ ఉన్నాయి. ఒక శబ్దాన్నీ, మరొక శబ్దాన్నీ ఒక ధోరణిలో కలిపి, ఒక విలక్షణమైన గానం పుట్టించి, దాని రెక్కలమీద కూర్చోబెట్టి, వట్టి దూరానుభవాలనైనా అందజేసి, ఎట్టి దూరలోకాలనైనా కనపరచి విహరింప