
4-PALAGUMMI PADMARAJU RACHANALU
by PALAGUMMI
₹100
In stock · 311 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెలుగు కథకు ఈడొచ్చిందా? "శైశవము దాటి మనసు ముసలితనమ్మునాశ్రయించుట దేశమర్యాద మాకు" ఏదో సందర్భంలో నేను రాసిన పద్య ఖండం తెలుగుజాతి మొత్తం భారతజాతి కూడా -ఇంకా శైశవదశలోనే ఉంటే, తెలుగు కథ, ఖండకావ్యం పుట్టుకతోనే యవ్వనదశ నందుకున్నాయి. గురజాడ వారి కథలూ, ఖండకావ్యాలూ చదివారా మీరు? వాటిలో యౌవనసహజమైన లక్ష్యశుద్ధి, ఆవేశం కనపడతాయి. చిత్రం, కన్యాశుల్కంలో ఆయన మానసికంగా పండిపోయిన ప్రౌధుడు. కథల్లో, ఖండ కావ్యాల్లో యువకుడు, ముఖ్యంగా ఖండకావ్యాల్లో తెలుగు కథకూ ఖండకావ్యానికీ వరవడి పెట్టింది ఆయనే. కథలూ, ఖండకావ్యాలూ ఎందుకు ముడి పెడుతున్నారంటారేమో రెంటికీ సాన్నిహిత్యం ఉంది. తెలుగులోనే కాదు అన్ని భాషలలోనూ ఈ యుగంలోనే కాదు అన్ని యుగాల్లోనూ, ఇతివృత్తంలో రచనా శిల్పంలో సామ్యమే కాదు, సారూప్యతా కనబడుతుంది. 1920 మొదలు ఇంచుమించు 1935 దాకా చూడండి. ఒక్క 'చలం' తప్ప మిగతా కథకులు, బాపిరాజు, మునిమాణిక్యం, విశ్వనాథ, వీర రాఘవస్వామి- అందరూ సాహిత్య రంగంలో జాతీయ వాదులు, కొందరు రాజకీయ రంగంలో కూడా తెలుగు జాతి, తెలుగు సంస్కృతి, వారికి ఆరాధ్యదైవతాలు. రాయప్రోలు వారి కష్ట కమల, తృణ కంకణం, కాస్త విగణంచేసి వ్రాస్తే ఆనాటి కథానికల కోవలో చేరిపోతాయి. పదం భావం లలితంగా ఉండాలి. తెలుగుతనాన్ని అందలం ఎక్కించాలి. విశ్వనాథవారు ఆంధ్రచరిత్రకు తమ ఖండకావ్యాలలో నివాళులెత్తారు. కొన్ని కథలలో కూడా తెలుగు గడ్డ గొప్పతనాన్ని 'రుజువు' చేశారు. తెలుగు కుక్క కూడా, సీమకుక్క కన్నా గొప్పది. వారి “మార్లీక్సీ దుర్గంలో కుక్క" చదివారా?. బాపిరాజుగారికి తెలుగు చరిత్రలో ఉన్నదంతా అపురూపమైనది. చరిత్ర గ్రంథాలలో వ్రాసి ఉన్నది కాదు. ఆయన చరిత్ర కాల్పనికమైన హృద్యమైన ఒకానొక స్వాప్నిక దృశ్యం. దానికి దేశ కాలాలతో నిమిత్తం లేదు. అనాదిగా వస్తున్న ఒక అమృత స్రోతస్సు అది. బాపిరాజుగారు అందులో నిరంతరం మునిగి తేలుతూండేవారు. కథల్లోనే కాదు. జీవితంలో కూడా 'భోగీర లోయ'లో కథానాయకుడు ఆయనే. మొదట 'శారద'లో, తరువాత 'భారతి'లో ఇటువంటివే ఎన్నో కథలు పడ్డాయి. అన్నీ ప్రాచీనాంధ్ర తేజాన్ని, తెలుగు జీవితాన్ని ఉత్ప్రేక్షించేవే.