
5-SARATH SAHITYAM CHARITRA HEENULU - NPH
₹350
In stock · 17 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
సాంసారిక సంప్రదాయ సంకెళ్ళతో, సామాజిక దురన్యాయాలసమ్మెట పోట్లతో బెంగాలీ స్త్రీ ఇంటికే కట్టుబానిస. కుహనా వంశగౌరవాలసుడిగుండంలో అడుగంటి శిథిలమైపోతున్న జమీందారీ యుగం, ఊహించని మార్పులకు తట్టుకోలేక చితికిపోతున్న గ్రామీణ సమాజం. అందులోంచి అప్పుడప్పుడే తలెత్తబోతున్న పెట్టుబడిదారీ సమాజాంకురాలు-ఇదీ శరత్చంద్ర చటర్జీ జీవించిన రచనా వ్యాసంగం సాగించిన కాలంనాటి బెంగాలీ సమాజం. ఈ సమాజంలో కృశించి కునారిల్లుతున్న ఇంటిస్త్రీ గుట్టు రట్టు చేసి నలుగురి ముందూ నిలబెట్టి వీరి ఈ స్థితికి కారకులెవరు? అంటూ తన సాహితీ సృజన ద్వారా ప్రశ్నలకొడవళ్ళను సమాజం పై విసిరాడు శరత్. జమీందారీ వర్గం డొల్లతనాన్నీ, డాంబికాలనూ, పల్లీ సమాజంలోని సమైక్యతనూ, వైరుధ్యాలనూ వర్ణిస్తూ మొత్తం గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టాడు. అందుకే బెంగాలీ పాఠకులు శరత్ను అభిమానించినంతగా మరే బెంగాలీ రచయితనూ కళ్ళకద్దుకోలేదు. శరత్ 17 నవలికలూ, 13 నవలలూ, 17 కథలూ, 5 అసంపూర్తి నవలలూ, అనేక వ్యాసాలూ రాశాడు. అందులో స్త్రీని అన్ని కోణాలనుంచీ చిత్రిస్తూ, శక్తిస్వరూపిణిగానూ, దయార్ద్ర హృదయినిగానూ, సేవాతత్పరురాలుగానూ, ప్రేమామృతవర్షిణిగానూ, ఉద్యమ శీలినిగానూ నిలిపిన ఘనత శరత్ ది. బెంగాలీ సాహిత్యకారుల్లో బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గద్యరచనలో వాస్తవికతా వాదంతో వారిని మించిన వాడయ్యాడు శరత్. అన్ని భారతీయ భాషల్లోకీ శరత్ రచనలు అనువాదాలయ్యాయి. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ శరత్ సాహితీ సృజన చేశాడు. 19వ శతాబ్దం మధ్య నుండి 20వ శతాబ్దం మధ్య వరకు శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక, సామాజిక పరిస్థితులే కొంచెం అటూ ఇటుగా తెలుగునాట కూడా ఉన్నాయి. స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ, ప్రధానంగా స్త్రీలనూ ఆకర్షించాయి. అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత ఆదరణీయ రచయిత కాగలిగాడు. శరత్ రచనలను పలువురు రచయితలు తెలుగులోకి అనువదించారు. వీరిలో బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి గార్ల అనువాదం సరళంగానూ, సూటిగానూ, మూల విధేయంగానూ ఉంటుంది. అందుకే పాఠకులాదరించారు. తమవాడుగా శరత్న భావించారు. కనుకనే చదవడం నేర్చిన ప్రతి తెలుగువాడి హృదయంలోనూ అభిమాన రచయితగా భద్రపీఠం పొందాడు శరత్.