AMRUTHA VAHINI-200 by M.DATTATREYA SARMA Telugu book cover

AMRUTHA VAHINI-200

by M.DATTATREYA SARMA

₹200
In stock · 1 available
PublisherM.DATTATREYA SARMA
LanguageTelugu
మనందరి అమ్మను గురించి ఇప్పటికి ఎన్ని పుస్తకాలు వచ్చాయో ఎవరూ లెక్క పెట్టినట్టులేదు. 1962 లో అని జ్ఞాపకం "అంబికాసాహస్రి" వెలువడింది. అదే మొదటి పుస్తకం కావచ్చు. ప్రస్తుతం కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులైన పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాదరాయ కులపతి రాసిన గ్రంథమది. తరువాత యేటా ఏవో పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. ఇంగ్లీషులోగాని, తెలుగులోగాని, ఇతర భాషలలోగాని మొత్తం ఒక వందకు పైమాటే ఉండవచ్చు. ఇందులో పద్య కావ్యాలు ఉన్నాయి. సంకలనాలు ఉన్నాయి. వ్యాసాలు ఉన్నాయి. జీవిత చరిత్ర తరహా రచనలూ ఉన్నాయి. డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వంటి శాస్త్రజ్ఞులు, రమణ మహర్షి అంతేవాసి శ్రీకృష్ణభిక్షు వంటి తత్త్వవేత్తలు, డాక్టర్ కొమరవోలు వెంకటసుబ్బారావు వంటి వెనుకటి తరం కవులు, శ్రీనదీరా వంటి గేయ రచయితలు, మిస్టర్ రిచర్డ్ వంటి పాశ్చాత్య గ్రంథకర్తలు, శ్రీమతి కుసుమా చక్రవర్తి మొదలైన రచయిత్రులు అమ్మను గురించి భావితరాలు చదివి లబ్ధి పొందడానికి అనువైన సాహిత్య సంపదను అందించారు. అమ్మను గురించి వెలువడిన పుస్తకాలలో ఒకరు రాసినట్టు మరొకరు రాయలేదు. ఎవరి పద్ధతి వారిది. నాకు ఎప్పటికప్పుడు అనిపిస్తుంటుంది ఇంతమంది ఇన్ని రచనలు చేశారే. చెప్పడానికి ఇంకేమైనా మిగిలి ఉంటుందా అని. నాలుగైదు పుస్తకాలకు నేను పీఠికలు రాశాను కూడా. మరి, నేను చెప్పదలచుకొన్నది అంతా చెప్పానా అని ప్రశ్నించుకొంటే లేదేమో అనే అనిపిస్తుంది. ఇతర సోదరీ సోదరుల సంగతీ అంతేకావచ్చు. అమ్మను గురించి కొత్త పుస్తకం ఏదైనా వస్తే పేజీలు తిప్పి చూస్తాను. ఆశ్చర్యంగా ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తాయి. అమ్మ జీవితం నిజంగానే మహోదధి. అది వైశాల్యంలోనూ, లోతులోనూ కూడా మహాసముద్రమే. అందుకేనేమో అమ్మ జీవిత చరిత్రను అక్షరబద్ధం చేసినవారు "మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు" అని పేరు పెట్టారు. అమ్మ జీవితం మహా సముద్రమైతే అందులో నుంచి ఎన్ని తరంగాలను గుర్తించినా ఇంకా అంతకు ముందు ఎన్ని ఉన్నాయో అన్నే మిగిలి ఉంటాయి. కనుక కొత్తగా మరెందరైనా రాయవచ్చు. సముద్రం నుంచి ఎంతనీరు తోడుకున్నా సముద్రం అంతే మిగిలి ఉంటుంది.