
ANDE NARAYANASWAMY KATHALU
₹400
In stock · 2 available
PublisherANDE BABAPRASAD
LanguageTelugu
స్నేహితుడు పార్థసారథికీ, ముకుందానికి విరోధం వచ్చిందన్న వార్త విని గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఆఫీసువేళల్లో తప్ప వాళ్ళను ఒంటరిగా చూచిన వాళ్ళు వుండరు! లోగడ వాళ్ళ స్నేహాన్ని చూసి అసూయపడ్డవాళ్లు కొందరు సంతోషించారుగూడా! ఇప్పుడు ఇద్దరికీ నోటిమాటలే కాకుండా కళ్ల చూపులుగూడా లేకుండా పోయినవి. ఇద్దరూ బజారులో తారసిల్లినా ఆమడదూరం తొలిగిపోతున్నారు. పార్థసారథినీ, ముకుందాన్నీ గూడా ఇంట్లో పెద్దవాళ్లు “ఒరే! మీరు బాల్యస్నేహితులు. ఒకకంచాన తిని ఒకమంచాన పండినవాళ్లుకదా, మీ కెందుకురా యీ విరోధం?" అని కూకలు వెయ్యకపోలేదు. "నేనేమీ అనలేదు. వాడే నాతో మాట్లాడడం లేదు" అని ఒకరూ, "నావల్ల తప్పేమీ లేదు. వాడే బిగుసుకుపొయ్యా'డని మరి ఒకరు- యిట్లా యెవరి మటుకు వాళ్లు సమాధానాలు చెప్పారు. పెద్దవాళ్లు మందలించినా వాళ్ళ మనస్సులు మారలేదు. ఆ గ్రామంలో రెండు పార్టీలు, రెంటికీ బద్ధవైరం. ఒక పార్టీ వాళ్లు యేపని తలపెట్టినా (అది గ్రామానికి మేలు చేసేదిగాని, కీడు చేసేదిగాని) రెండో పార్టీవాళ్లు ప్రతిఘటించి దాన్ని కాకుండా చెయ్యడమే వాళ్లపని, ముకుందం రెండో పార్టీలో చేరిపొయ్యాడు. వాళ్ళకు మరింత బలం చేకూరింది. ముకుందం పార్టీ వాళ్లు అవతల పార్టీవాళ్లంటే ఒంటి కాలిమీద వెళ్ళడం మొదలు పెట్టారు. గ్రామంలో రాములవారి కోవెల పూజాపునస్కారాల పట్ల రెండు పార్టీలకూ తగాదాలు వచ్చి అదివరకే వ్యాజ్యాలుపడి గుడికి తాళాలు వేసుకున్నారు. ఒకరోజు సాయంత్రం కోవెల ఆవరణలో యెదిగివున్న గడ్డిని పార్ధసారథిగారి పాలేరు కోస్తూ వుండగా అవతలి పార్టీవాళ్లు వచ్చి కొడవలి, తట్ట లాక్కుని పాలేరును కొట్టి పంపారు. కొట్టడానికి వచ్చిన గుంపులో ముకుందం కూడా వున్నాడు. అప్పుడు పార్థసారథి అవతలి పార్టీలోని కొందరి పేర్లు చేర్చి చార్టీ పెట్టాడు. అక్కడ విశేషమేమిటంటే! ముకుందాన్ని మాత్రం అందులో చేర్చలేదు. అందుకు పార్టీలో కొందరు పార్థసారథిని "ఏం మాజీ స్నేహితుడనా అతణ్ణి చేర్చలేదని దుయ్యబట్టారు. అందుకు అతడు వాళ్ళకిచ్చిన సమాధానం ఇది: "వాణ్ణి ఇటువంటి చచ్చు కేసుల్లో ఇరికిస్తే ఏం లాభం? గురిచూసి దెబ్బకొడితే ఇక యెప్పటికీ తలయెత్తకుండా వుండాలి. వాణ్ణి వదిలిపెట్టానని ఎంచవద్దు" అని. ఇక ముకుందం వాళ్ళతో వీళ్ళతో “నా పేరు పెట్టడానికి వాడికి గుండెలెక్కడున్నాయి! మనమంటే వాడికి సింహస్వప్నం" అని చెప్పుకున్నాడు.