
ANDHRULA RAJADHANI AMARAVATHI
₹440
In stock · 330 available
PublisherUNNAM BROTHERS PUBLICATIONS
LanguageTelugu
1. అమరావతి చరిత్ర ప్రపంచంలోని పురాతన నగరాలలో అమరావతి ఒకటి. హిందూ. జైన, బౌద్ధ మతాలకు కేంద్రం అమరావతి. అమరావతి పూర్వం భారతదేశానికి రాజధానిగా కూడా కొన్ని సంవత్సరాలు ఉంది. ఎన్నో రాజవంశాలకు రాజధాని అమరావతి. మూడు వేల సంవత్సరాల క్రింద అమరావతిని ధాన్యకటకం అనేవారు. ధాన్యకటకానికి ధరణికోట అనే పేరు కూడా ఉంది. ధనరాశులు ఎక్కువగా ఉండటంవల్ల ఆ పేరు వచ్చిందని చెప్తారు. ధాన్యకటకం అంటే పంటలు ఎక్కువగా పండే ప్రదేశమని అర్థం. అమరావతికి నీరు, పంట సమస్యలు లేకపోవడంవల్ల ఈ ప్రాంతాన్ని ఎక్కువగా రాజవంశాలు రాజధానిగా చేసుకొని పరిపాలించాయి. అమరావతిని మౌర్యులు, శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చోళులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, హైహేయులు, కోట కమ్మరాజులు, వాసిరెడ్డి వంటి వంశాలు పరిపాలించాయి. శాతవాహనుల కాలం నుంచి నేటివరకు అనేకమంది రాజుల పాలనలో శోభాయమానంగా విరాజిల్లిన తెలుగునేల సంస్కృతి, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన ధరణికోట అమరావతి, శాతవాహన రాజుల రాజధాని అయిన ధాన్యకటక నగర వైభవాన్ని ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే, ధాన్యకటకం అమరావతి రెండూ కలిసిన ఒక మహానగరం. చైనా యాత్రికుడు హుయాన్్సంగ్ ధాన్యకటకం మహాంధ్రదేశానికి రాజధాని అని వర్ణించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి శాసనాలలో ఈ నగరం ధనకటకమని పేర్కొనబడినది. క్రీ.పూ.200 నాటికే ఈ పేరు వాడుకలో ఉన్నట్లు అమరావతి మహాచైత్యంలోని శాసనం ద్వారా తెలుస్తున్నది. అమరావతి నాటి బౌద్ధుల పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ మహాచైత్యం అశోకునికి పూర్వమే ఒక నాగరాజుచే పెంపు చేయబడి శాతవాహనుల రాజుచే మరింత వృద్ధి చేయబడింది. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నాగార్జునాచార్యుని ప్రోత్సాహం వల్ల ఈ మహాచైత్యానికి ఒక ప్రాకారం నిర్మించబడింది. అమరావతిలో బుద్ధుని అస్తికలపై నిర్మింపబడిన మహాచైత్యం, ఇతర చైత్యాలు, ఒక విశ్వవిద్యాలయం ఉండేవి. కాలగర్భంలో అన్నీ నశించాయి. మహాచైత్య శిధిలాలకు సంబంధించిన ఫలకాలు మాత్రం కొన్ని నేటికీ లండన్ మ్యూజియంలో, మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. అమరావతి చైత్యం పైన బుద్ధుని జీవితగాథలు, జాతక కథలు వందల సంఖ్యలో చెక్కబడ్డవి. అమరావతి శిల్ప విశిష్టతను నేడు కళాప్రపంచమంతా వేనోళ్ళ శాసిస్తున్నది. భారతదేశంలోని బౌద్ధ చిత్ర శిల్ప కళలో అమరావతి ఒరవడి పెట్టింది. ఇక్కడ చూడదగింది ముఖ్యంగా అమరేశ్వరాలయంలో వెలసిన దేవుడు అమరేశ్వరస్వామి, దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచ ప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది. ఇక్కడ అమరావతికి, ఆంధ్రదేశానికి ప్రాచీన కాలం నుండి విడదీయరాని సంబంధం ఉంది. జలానికి జీవమని అర్ధం. నీటి వసతులే జీవులకు నెలవులు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న జనావాసాలలో అమరావతి ఒకటి. అమరలింగేశ్వరస్వామి కొలువై ఉండి, దక్షిణ కాశిగా పేరొందిన పుణ్యక్షేత్రమే అమరావతి, అమరావతికి సంబంధించి ఒక స్థల పురాణం వ్యాప్తింలో ఉంది.