ANDHRULA SANGHIKA CHARITRA by SURAVARAM PRATAPA REDDY Telugu book cover

ANDHRULA SANGHIKA CHARITRA

by SURAVARAM PRATAPA REDDY

₹200
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట 1949లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" సుమారు యాభై సంవత్సరాలలో ఐదవసారి అచ్చుకావడం గ్రంథ ప్రాశస్త్యాన్ని నిరూపిస్తున్నది. ఆంధ్ర వాఙ్మయం యీ శతాబ్దిలో కొత్తమలుపు తిరిగి ఆధునిక ముద్ర వేసుకొన్నది. చరిత్ర, విజ్ఞానాలకు సంబంధించిన గ్రంధాలు అనేకం ప్రకటితమై భాషా స్వరూపం మారినది. ఒకసారి యీ వచన వాఙ్మయాన్ని స్థూలంగా పరిశీలించి నప్పటికినీ చరిత్ర, ఆధునిక విజ్ఞానం తెలుగుభాషలో ప్రాధాన్యం వహించినవని చెప్పక తప్పదు. ఇందువలన తెలుగు భాషకు క్రొత్త వికాసం కలిగినది. గడచిన ఆరవశతాబ్దిలో తెలుగులో ప్రకటితమైన గ్రంథాలలో ఉత్తమ శ్రేణికి చెందిన వాటిని కొన్నింటిని పేర్కొనవలసి వస్తే ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వక తప్పదు. అందుచేతనే కేంద్ర సాహిత్య అకాదమీ భారతీయ సాహిత్యంలో ప్రతిభాషకు ప్రతి సంవత్సరం ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి యీ గ్రంథానికి ఇచ్చినది. ఇది తెలుగులో మొదటి జాతీయ బహుమతి పొందిన గ్రంథం కావడం గమనించవలసిన విషయం. ఇది యీ గ్రంథ విశిష్టతను చాటి చెప్పుతున్నది. ఈ గ్రంథకర్త స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డిగారు యీ శతాబ్దపు ఆంధ్ర విద్వాంసులలో అగ్రశ్రేణికి చెందిన వారు. తెలుగు, సంస్కృతం; ఇంగ్లీషు, ఫారసీ, ఉర్దూ, హిందీ మొదలైన భాషలలో వారు ప్రవీణులు. వృత్తి చేత న్యాయవాది అయినప్పటికినీ, ప్రవృత్తి చేత భాషా వికాసానికి పరిశ్రమించిన విద్వాంసుడు ఆయన. తమ న్యాయవాది వృత్తిని కొన్ని సంవత్సరాలలోనే వదలివేసి దినపత్రికా సంపాదకులుగా జీవితాన్ని, భాషాసేవకు, ప్రజాసేవకు వినియోగించిన దేశభక్తుడు ప్రతాపరెడ్డిగారు. రచయితగా వాఙ్మయంలోని అనేక ప్రక్రియలను సాధించినాడు. ప్రతాపరెడ్డిగారు స్వయంగా కవులు; పరిశోధకులు, వచన రచయితలు, బహుగ్రంథకర్తలు. ఆయన రచించిన గ్రంథాలలో ఆంధ్రుల సాంఘిక చరిత్రతోపాటు రామాయణ విశేషములు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు ముఖ్యమైనవి. ఈ పుస్తకాలన్నీ అపారమైన పరిశోధన ఫలితాలు.