
B P VYADHI SULABHA NIVARANA
₹50
In stock · 21 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
ముందుమాట వ్యాధుల్లో ప్రమాదకరం అయినవీ, ప్రమాదకరం కానివీ అని మనం వేర్వేరుగా వర్గీకరించవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడంతటి వాడికి బొటనవ్రేలికి చిన్న బాణం తగిలి, చివరికి ఆయన అవతార పరిసమాప్తికి కారణం అయ్యింది. కాబట్టి, అరికాల్లో ముల్లుకే కూడా ప్రాణాంతకం కావచ్చు. ఏ వ్యాధినైనా ప్రాణాంతకం అయ్యేదాకా తీసుకుపోవటంలో రోగి పాత్ర ప్రధానంగా ఉంటుంది. దీర్ఘవ్యాధులని మనం చెప్పుకునే చాలా వ్యాధులు దీర్ఘవ్యాధులుగా పుట్టటం లేదు. వాటిని దీర్ఘ వ్యాధులుగా మారుస్తున్నది మనమే! ఒక వ్యాధి వచ్చిందని నిర్ధారణ అయ్యాక దాని గురించి రోగి క్షుణ్ణంగా అర్ధం చేసుకో గలిగితే, రోగి ఆ వ్యాధిని తేలికగానూ, త్వరగానూ తగ్గించుకుంటాడు. రోగాన్ని అర్థం చేసుకోలేకపోతే త్వరగా తగ్గించండి డాక్టరుగారూ అని రోజుకో వైద్యుణ్ణి మారుస్తూ తిరుగు తుంటాడు. ఈ రెండింటిలో ఏ మార్గం మంచిదో ఆలోచించండి....! చాలామంది ఫోను చేసి, "బీపీ వ్యాధికి ఆయుర్వేదంలో మంచి మందున్నదా?" అన డుగుతుంటారు. అంటే ఇతర వైద్య శాస్త్రాలలో మంచి మందుల్లేవని వాళ్ళ అభిప్రాయం కాకపోవచ్చు. ఒక మాత్ర వేసేసుకుంటే ఇంక జన్మలో అది మళ్ళీ రాకుండా తగ్గిపోయే మందేదైనా ఉన్నదేమోనని రోగి ఆశపడటం సహజం. అలా కోరుకోవటంలో తప్పులేదు. కూడా! తప్పనేది ఎక్కడున్నదంటే, ఇదంతా మందులతోనే సాధ్యపడాలని కోరుకోవటంలో ఉంది. ఒకాయన తన జేబులో పచ్చనోట్లు కనిపించేలా పెట్టుకుని హడావిడిగా వచ్చి, "ఆహార నియమాలు చెప్పకండి. ఉప్పు మానేయాలి లాంటి నీతి శతకాలు వల్లె వేయకండి. బీపీ మళ్ళీ పెరక్కుండా చేసే మందుగానీ, మందులుగానీ ఏవైనా ఉన్నాయా? ఉంటే ఎంతౌ తుంది?" అనడిగాడు ప్రతీదీ డబ్బుతోనే సాధ్యం అనే నమ్మకం మనలో ఇలా చాలా మందికి ఉంది. బీపీ వ్యాధి వచ్చిందంటే మన ఆహార విహారాలు, మానసిక పరిస్థితులు ఇవన్నీ హింస బెట్టేవిగా ఉన్నాయని శరీరం చేసే హెచ్చరికగా భావించాలి. ఏ ఏ కారణాలవలన బీపీ పెరుగుతోందో ఆయా కారణాలను ఆపటానికి ఇష్టపడని వారు బీపీని పెంచుకుంటూ, మందులు మింగి తగ్గించుకోవాలని చూస్తూ అడుసు తొక్కుతూ, కాళ్ళు కడుక్కుంటూ.... అలా జీవితాన్ని నెట్టుకుంటూ గడిపేస్తారు. అంటే, ప్రయాణ సుఖం లేని జీవనయానం సాగిపోతూ ఉంటుంది.