
BALA PRABHA - 18 ADHYATMIKA BALA KATHALU
by KANDUKURI VENKATA GOVINDESWARASARMA
₹100
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA GOVINDESWARASARMA
LanguageTelugu
పిల్లలకోసం కథలు రాయడం మామూలు విషయం కాదు. ఒకవేళ రాయగలిగినా... వాటిని నేటితరం పిల్లలకు అర్థమయ్యే భాష, శైలిలో అందించడం కత్తిమీద సాము వంటిదే. అయితే ఆ సామును చాలా సులువుగా చేసేశారు కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మగారు. ఎంతో చక్కటి పౌరాణిక గాథలను మరెంతో సులువుగా నీతికథల రూపంలో అలవోకగా... అరటిపండు వొలిచినంత సులువుగా చెప్పారు. చక్కటి గ్రంథాన్ని అందించిన గోవిందేశ్వర శర్మ విజయవాడలోని కామాక్షీపీఠానికి అధిపతి కూడా కావడం వల్ల అమ్మవారి దయతో బాలలకోసం ఇంపైన కథలను అద్భుతంగా వండి అందంగా వడ్డించారు. శ్రీశైలప్రభమాసపత్రికలో మాసానికో కథ చొప్పున సుమారు ఏడాదిన్నర పాటు నడిచిన ఈ శీర్షిక ఎంతోమంది పాఠకాభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఈ కథలన్నింటినీ పుస్తక రూపంలో తీసుకురావాలని రచయిత అనుకున్నదే తడవుగా అందమైన బొమ్మలతో, ఆకర్షణీయమైన అట్టతో బాలలను ఆకట్టుకునే సైజులో చక్కటి పుస్తకాన్ని తీసుకువచ్చారు పద్ధెనిమిది కథలున్న ఈ పుస్తకంలో పార్వతీదేవి అన్నపూర్ణగా ఎలా మారింది, నిష్కల్మషమైన భక్తితో గొడగూచి మోక్షాన్ని ఎలా పొందిందీ, ఎంత చదివినా, ఎంత నేర్చినా తగిన వయసులో వివాహం చేసుకోకుంటే అదంతా నిష్ప్రయోజనమనీ, చదువనేది పుస్తకాలలో ఉండేదే కాదనీ, సమాజం నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చుననీ బోధించడం బాగుంది. అన్ని జీవులలోనూ తానే ఉంటాను కాబట్టి ఏ జీవిని హింసించినా అది తనను బాధించినట్లేనని పార్వతీదేవి కార్తికేయునికి పాఠం చెప్పిన తీరు బాగుంది. శివభక్తురాలైన బెజ్జమహాదేవి శివుడికి తానే అమ్మ అయి ఆయనను లాలించి బుజ్జగించిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. సాక్షాత్తూ పార్వతీదేవి చేతి నుంచి క్షీరామృతాన్ని సేవించిన బాలసంబంధుడి గురించి చదువుతుంటే ఆ బుడతడికి పట్టిన అదృష్టానికి అసూయ కూడా కలుగుతుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమేనని, దానికి శిక్షను అనుభవించవలసి వస్తుందన్న అణిమాండవ్యుడి కథ అహింస గొప్పదనాన్ని కన్నులకు కడుతుంది.