
BAMMA GARI BALLA MANCHAM
₹75
In stock · 284 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందు మాట శ్రీమతి చింతపెంట కమలగారు వ్రాసిన కథలన్నీ దేనికవే "ఉగాది పచ్చడిలోన షడ్రుచుల్లా" ఉన్నాయి. తను చదువురాని పల్లెటూరి దాన్ననో, ఏవో తెలిసీ తెలియని వ్రాతలా వ్రాస్తుంటాననీ అంటారు. కానీ ఆమె చాలా బాధలో ఉన్నా “సుందరకాండను” పాడి, పాడించి రికార్డు చేయించినందున మంచి అభివృద్ధిలోకి వచ్చారని నా అభిప్రాయం. "బామ్మగారి - బల్ల మంచం" కథలో ఆ తరంలోని అత్తగార్లు చేసే చాదస్తపు పనులను హాస్యం ఉట్టిపడేలా వ్రాశారు. “అట్లు వాయనం” కథలో తనమీద తనే జోక్స్ వేసుకుంటూ నవ్వించారు. ఆవిడ చూసిన సంఘటనలూ, జీవితానుభావాల్నీ కథలుగా వ్రాస్తున్నా నన్నారు. కానీ ఆవిడ రాసే కథలన్నిటిలో ఏదో ఒక సూక్తి చిన్న తారలా మెరుస్తూ కనిపిస్తుంది. పల్లెటూరి దాన్నని అంటారు కానీ, పుడుతూనే అన్ని విద్యలూ "తల్లి గర్భం” లో ఉండగానే నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. శ్రీమతి కమలగారి భాషాపరిజ్ఞానం చూస్తే, ఆమె ఎమ్.ఎ. తెలుగు లిటరేచర్ చదివారేమో అనిపిస్తుంది. అరవై సంవత్సరాలు వచ్చాక కథలు వ్రాయడం మొదలు పెట్టినా కానీ “మూడవ కథల సంపుటి"ని కూడా ముద్రించగలుగుతున్నారంటే అభినందనీయమే. ఏ ఇరవై ఐదు సంవత్సరాల కిందో ఈ కథలు వ్రాసి ఉంటే పెద్ద రచయిత్రుల జాబితాలో చేరి అందరిలాగా సన్మానాలుపొంది ఉండేవారేమో అనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నాకానీ వ్రాసే కథలు చూస్తే హాస్యస్పారకంగా ఆరోగ్యాన్ని అందించేలా ఉన్నాయి. 'గృహప్రవేశం' కథలో కష్టాలు ఒక వంతైతే, భక్తితో పేదరికంవల్ల చేసిన పూజలూ రెండూ కలిపి ఆనందంగా ఆఖరి వరకూ నవ్వించేలా వ్రాశారు. నవ్వుల జల్లులు కురిపిస్తూ. ఈమెకు "నవ్వుల రాణి” అనే బిరుదు ఇస్తే మంచిదేమో అనిపించింది. "స్నేహం కథ" సెల్ఫోనుల్లో వయసులో తారతమ్యం గుర్తించకుండా, పేరును బట్టి మెసేజ్ లు పంపేవారికి సున్నితమైన సలహానిస్తూ హాస్యం రంగరించి వ్రాశారు. “ప్రళయం వచ్చింది” కథలో హాస్యాన్ని చిందిస్తూనే నగలూ, పట్టు చీరలకంటే పప్పు ధాన్యాలే ముఖ్యం అన్నారు పెరిగిన రేట్లకు చురకలు వేస్తూ. “డాబా ఇల్లు” అనే కథను ఒక ఇల్లాలు సంసార బాధ్యతలు ఎక్కువయినందున “డాబా” కట్టుకోవాలనే తన కోరికను అణచుకుని ఎదురింటి రైతు కట్టుకున్న డాబాను చూసి పరవశిస్తూ తనువు చాలించింది. “కొత్తగౌను” అనే కథ స్త్రీ హృదయంలో తన పిల్లల కోసం పడే ఆరాటం తెలియచేస్తుంది. “నాకూ చదువు కావాలి” అనే కథ ఒక స్త్రీ చదువుకోవాలనే తాపత్రయాన్ని తెలియజేశారు. "తెప్పలుగ నీరు నిండిన” అనే కథలో ధనం ఉన్నప్పుడు చుట్టాలు ఇంటి చుట్టూ తిరిగి, తీరా వాళ్ళ బీదతనంతో ఉండి అనారోగ్యంతో ఉన్నారని తెలిసి ఒక్కళ్ళు కూడా రారు సరికదా కనీసం ఫోనులోనయినా పలకరించరు. ఇంకా చాలా కథలున్నాయి. వాటిని పాఠకులే చదివి వారి అభిప్రాయాన్ని తెలుపుతారని ఆశిస్తాను. దైవానుగ్రహంవల్ల సత్సంకల్పంతో ఇంకా ఎన్నో కథలు రాయాలనీ, ఆమెకు దైవం తన అనుగ్రహాన్నీ, ఆరోగ్యాన్నీ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అభినందనలతో. వి.రమణ