BATHUKAMMA PATALU by PROF.RAVIKANTI VASUNANDAN Telugu book cover

BATHUKAMMA PATALU

by PROF.RAVIKANTI VASUNANDAN

₹100
In stock · 20 available
PublisherPROF.RAVIKANTI VASUNANDAN
LanguageTelugu
మనిషి మాటకంటే ముందే పాట పుట్టింది. పసిపాపల కూనరాగం, తుమ్మెదల పాట, కోయిల పాట, చివరికి గాలి ఈల పాట ఇందుకు తార్కాణాలు, శ్రమను దించుకోవడానికీ ఉత్సాహం పెంచుకోవడానికీ ఉదయించిన జానపదుల పాటలతోపాటు, నాగరికుల జావళీలూ కీర్తనలూ గణుతికెక్కాయి. పాట జాతి సంస్కృతికి ఒక సంగీత చిహ్నం! ఇలాంటి అనేక వేల పాటల్లో ప్రసిద్ధి వహించినవి మన తెలంగాణా బతుకమ్మ పాటలు, అన్ని కాలాల్లోనూ మనోజ్ఞమైన శరత్కాలంలో ఆడపిల్లలు, తల్లులు, అందాల భరిణలు సర్వాలంకార శోభితలై ఆనందంగా ఆడుతూ పాడుతూ అలరించే పండుగ. అనేక వేల మంది స్త్రీలు-హంసల అడుగులతో, కోకిల గళాలతో, చప్పట్ల నినాదాలతో రాగతాళయుక్తంగా దెసలు పండించే బతుకమ్మ పాటలు సామాన్యమైనవి కావు. మొత్తం దేశంలోనే, సువిశాల విశ్వంలోనే విశిష్టమైన పండుగ మన తెలంగాణా బతుకమ్మ పండుగ. బొడ్డెమ్మ పండుగతో ప్రారంభించి, ఎంగిలిపూల బతుకమ్మ -సద్దుల బతుకమ్మ దాకా రెండు వారాలపాటు మన తెలంగాణ నేలను పులకింప జేసే బతుకమ్మ హేళ - అన్ని పండుగల్లోనూ అత్యద్భుతం. అన్ని విధాల పూలూ ఆకులూ రంగులూ ఆడపడుచుల చేతుల్లో అందాల బతుకమ్మలుగా రూపుదిద్దుకునే అపురూపమైన పండుగ. గత సంవత్సరం (2013) బతుకమ్మ పండుగ సందర్భంగా నా అర్ధాంగ లక్ష్మి శ్రీమతి విజయలక్ష్మి, మా కోడలు చి॥ల॥సౌ॥ శ్రీమతి స్వప్న ప్రేరణతో ఒక వారం రోజుల్లో అవతరించిన కృతి ఈ బతుకమ్మ పాటలు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆశీరభినందనలు. బతుకమ్మ పాటల్లో ఎన్నో పల్లవులూ పదాలూ అనుకడలూ ఉన్నాయి. అవన్నీ నేను ఎత్తుకోలేదు. చిన్నతనంలో నేను విన్న కొన్నిటిని మాత్రమే మచ్చుకు మొదటి పాటలో పాటించి, అందరికీ అనువైన 'ఉయ్యాలో!' అనే పదంతో ముందుకు సాగాను.