BATHUKE BANGARAM by DEVARAJU RAVI, DEVARAJU SEETA Telugu book cover

BATHUKE BANGARAM

by DEVARAJU RAVI, DEVARAJU SEETA

₹80
In stock · 2 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ఊలుటోపీ “ఒరేయ్... ఒరేయ్... ఏమిటా మీద పడి తొక్కడం దిగు దిగు వెధవాని." "పోన్లెద్దురూ. మరీ అంత గట్టిగా కేకలేస్తారేవిటీ? పిల్లాడు హడలిపోయాడు. పిల్లలకి మెల్లిగా బుజ్జగించి చెప్పాలి కానీ!" రామకృష్ణ కాస్త కోప్పడినా, నీరజ మాత్రం ముందు నుంచీ వెనకేసుకొచ్చేది. "చూడు బాబీ! బొజ్జలో నీకొక బుజ్జి తమ్ముడున్నాడు. ఇలా మీద పడితొక్కేస్తే, మరి వాడికి నొప్పెట్టదూ? ఇలారా. నా పక్కన కూర్చో, బావుందా ఈ టోపీ" అంటూ తను అల్లుతున్న ఎర్రటి పూలుటోపి బాబిగాడికి చూపించింది నీరజ. ఎర్రగా, మెత్తగా కొన తేలివున్న ఆ టోపీ అంటే ఎంత ఇష్టపడిపోయాడో బాబిగాడు. "అమ్మా! నాకోటి ఇవ్వవే!” "అలాగే బాబీ! నీకిది సరిపోదుగా. బజార్లో మంచిదీ, ఇంతకన్నా పెద్దదీ కొనమని నాన్నగారికి చెప్తాంలే. ఏం?" "నాన్నకి చెప్పొద్దే..... కోప్పడతాడు.” మూడునెలల క్రితం జరిగిన ఈ సంఘటన, బాబిగాడు మరిచిపోలేక పోతున్నాడు. తమ్ముడు పుట్టి ఇన్ని రోజులైనా, తనికి పూలుటోపీ, ఇలాంటి-ఎర్రటి టోపీ కొననేలేదు. 'నాన్న కోప్పడతాడు' అని అనగానే, అమ్మ వూరుకుండిపోయింది. మరి తనకి టోపీ ఎలా వస్తుంది? తమ్ముడు పెట్టుకున్న వూలుటోపీ, ఆవేళ ఎలాగేనా మెల్లగా తీసి పెట్టుకోవాలని అనుకున్నాడు బాబిగాడు. నాన్నగారు ఆఫీసుకు వెళ్ళిపోయారు. అమ్మ నీళ్ళు పోసుకుంటూంది. పనిమనిషి వచ్చి, తమ్ముడికి నీళ్ళు కాచి, పోసి, పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఉయ్యాల్లో తమ్ముడు బుద్ధిగా పడుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకుని, ముక్కాలి పీట ఎక్కి, మెల్లగా చంటివాడి వూలుటోపీ విప్పడం మొదలు పెట్టాడు. మధ్య మధ్య అమ్మ వస్తోందేమో - అని, ఇటూ అటూ చూస్తూ.