
BHARATHA KATHA LAHARI-120
₹120
In stock · 32 available
PublisherSPOORTHI PUBLISHING HOUSE
LanguageTelugu
మనవి భారతకథ యథార్థచరిత్ర అయితే, చరిత్రని ఇంతటి అద్భుతకావ్యంగా వ్యాసమహర్షిలా మరెవరూ చెప్పలేదేమో! భారతకథ వ్యాసుడి కల్పన అయితే ఇంత గొప్పగా ఏకవీ కావ్యకల్పన చెయ్యలేదేమో! నానృషిః కరుతే కావ్యమ్ - ఋషి కానివాడు కావ్యం చెప్పలేడు, అని పెద్దలంటారు. అంటే కావ్యరచన ఆషామాషీ వ్యవహారం కాదని, ఉత్తమ జ్ఞానం సాధించి ఋషి అయ్యాక నిస్వార్ధంగా సమాజహితంకోరి చేసే మహత్కార్యం అని అర్థం చేసుకోవాలి. ఋషులై కావ్యం చెప్పిన వాళ్ళు వాల్మీకి వ్యాసమహర్షులు. భారతజాతి మార్గదర్శక గ్రంథాలుగా ఆ ఋషుల రచనలు రామాయణ భారతాలని గౌరవిస్తుంది. ఆరెండింటిలో తెలుగువాళ్ళు భారతానికి మరీ చేరువయ్యారు. భారతపాత్రలలో తమని దర్శించుకున్నారు. ఆ పాత్రలు తెలుగు వారి కుటుంబ సభ్యులే. తెలుగుతనానికి భారతం బాగా దగ్గర కాబోలు. దానికి తగ్గట్టు కవిత్రయం తమ అద్భుతప్రతిభతో సంస్కృత భారతాన్ని తెలుగువారి కందించి వ్యాసుడి వారసులయ్యారు. భారతకథలో ఎన్నెన్ని పాత్రలు! పాత్రలన్నిటికి పరస్పర సంబంధం ఉన్నా ఏపాత్ర స్వభావం దానిదే. ఆ పాత్ర పుట్టుకనుంచి మరణం వరకు సహజ వికాసాన్ని వ్యాసమహర్షి రూపొందిస్తాడు. పాత్రని అర్థం చేసుకోవడంలో మనకి ఎక్కడా సంక్లిష్టత ఉండదు. శకునిలా మరొక పాత్ర ఉండదు. ధృతరాష్ట్రుడికి సన్నిహితులే అయినా విదుర సంజయుల స్వభావాలు ఎక్కడా కలవవు. మిత్రులే అయినా కర్ణుడిలా దుర్యోధనుడుండడు. భీష్మద్రోణులు కలిసి ఉంటారు, అయినా ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. పాండవులయినా అంతే. భారతంలోంచి ఒక భావాన్ని చెప్పి ఇది ఎవరిదంటే ఇలా విదురుడు మాటాడతా డంటాం. అంత స్పష్టమైన స్వభావాలతో లక్షశ్లోకాలలో కథానిర్మాణం చెయ్యడం వ్యాసమహర్షికే చెల్లింది. ఆ మహర్షి యథార్థవాది. ధర్మరాజు కదా అని పరమ ధర్మాత్ముడని చెప్పడు. ద్రోణుడి వధ సందర్భంలో ఆయన ఆడిన అబద్ధాన్ని ముసుగు వెయ్యకుండా చెప్పాడు. భీముడిలో ఉన్న జ్ఞానసంపదని చక్కగా వెల్లడించాడు. భారతకథని ఎన్నిసార్లు విన్నా తెలుగు వారికి విసుగు పుట్టదు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నది అందరికీ తెలిసిన సామెత. తెలుగువారికి గారెలు రుచి, భారతం అభిరుచి. భారతాన్ని ఇంతగా ప్రేమించడం తెలుగుజాతి సాంస్కృతిక ఔన్నత్యానికి గుర్తు. ఎక్కడో హస్తినాపురంలో, కురుక్షేత్రంలో జరిగిన కథ తెలుగువారి సొంతకథ అయింది.