BULLDOZER SANDARBALU by K SRINIVAS Telugu book cover

BULLDOZER SANDARBALU

by K SRINIVAS

₹250
In stock · 1 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076336
ఇప్పుడెక్కడున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? మను వాదమే మహా రాజ్యాంగమని నమ్మబలికే వారి నడుమ జీవిస్తున్నాం. ప్రజాస్వామ్యం పుట్టిల్లు భారతదేశమేనని, చాతుర్వర్ణమే దాని మూలమని దబాయించే వ్యవస్థలో భిన్నత్వం నుంచి నియంతృత్వం శాసించే ఏకత్వానికి మనం మన ప్రమేయం లేకుండానే ప్రయాణిస్తున్నాం. 'ఒక జాతిని గెలవాలంటే ప్రజలను నిరాయుధుల్ని చేయాలన్న' ఫాసిస్టు సిద్ధాంతమే ప్రామాణికంగా మాట్లాడే నోళ్లను మూయించి, ఆలోచించే మెదళ్లను బంధించి, ప్రశ్నించేవారి గొంతులను నులిమేసి, నిటారుగా నిలబడే వెన్నెముకలను విరిచి మూలనపడేసే కాలంలో బిక్కుబిక్కుమని బతుకుతున్నాం. ప్రజల మనసులోని మాటను గుండెవిప్పి వినాల్సిన ప్రజాస్వామ్య పాలకులు ఉండాల్సిన దేశాన్ని, కళ్ళూ చెవులూ మనసు లేని యాభై ఆరంగుళాల బుల్డోజర్ శాసిస్తున్న సందర్భం. ఆలోచనాపరులకు ఇదొక సంకట స్థితి, బుద్ధిజీవులకు ఇదొక సంక్షోభ సందర్భం. కళ్ళు చెవులు, హృదయం లేని బుల్డోజర్లు ముందుకు వెళుతున్నాయో, వెనక్కి పోతున్నాయో ఆలోచించలేవు. శిధిల శకలాల్లా మిగిలిపోయిన వారికి ఎక్కడున్నామో, ఎక్కడికి వెళుతున్నామో తెలియదు. నిర్దయగా అణచివేత సాగుతున్న వేళ నిర్భయంగా నిలబడి మాట్లాడేవాళ్ళు అరుదు. ఇప్పుడున్న అప్రకటిత అత్యయిక దశలో బుద్ధి జీవులు, కవులు, రచయితలు, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలమని విర్రవీగిన మహా మహా మీడియా సంస్థలు, వాటి అధిపతులు, సహస్రావధాన సంపాదకులు, తలలు పండిన పాత్రికేయ పండితులు మాట పెగలక మూగబోయిన సందర్భంలో గొంతు సవరించుకుని నిర్మాణాత్మక నిరసనను నివేదిస్తున్న ఒకే ఒక్క పాత్రికేయుడు కె. శ్రీనివాస్. సంపాదకుడిగా సమన్యాయ సూత్రాలను పాటిస్తూనే బాధితుల పక్షాన నిలబడడానికి కత్తిమీద సాము చేస్తున్న సాహసి. నిరంతర అధ్యయనం, సమాజం పట్ల, దేశం పట్ల ముఖ్యంగా ప్రజల పట్ల ప్రేమ, వ్యక్తిగా జీవితంలో, పాత్రికేయుడిగా వృత్తిలో నైతిక నిబద్ధత వల్ల ఆయన సంక్షోభ సందర్భంలో కూడా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. విస్తుపోయి వినడమే తప్ప మరోమాటకు తావులేని కాలంలో శ్రీనివాస్ మాట ఒక అనునయ వాక్యం. కుట్ర చట్రాల్లో కునారిల్లుతున్నవారికి ఆయన ధిక్కార స్వరం ఒక ధైర్య వచనం. మూక దాడులు, మూఢ విశ్వాసాల నడుమ భవిష్యత్తు మీద నమ్మకం నశిస్తోన్న దశలో వర్తమానాన్ని చిత్రిక పడుతూ చేస్తోన్న విశ్లేషణ భవ్యిత్తుకు ఒక కొత్త భరోసా. వారం వారం కె. శ్రీనివాస్ రాసే 'సందర్భం' ఏదైనా పీడితులు, బాధితులు, దుఃఖితులకు ఒక కొత్త వ్యాకరణం. ఇది రేపటికొక కొత్త వాగ్దానం. ఇది కొనసాగాలి. ఇది చదువవలసిన సందర్భం. ఆలోచించవలసిన సందర్భం. సంఘటితం కావలసిన సందర్భం. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిలబడవలసిన సందర్భం.