
C.S. RAO CHATURA NAVALALU
by C.S.RAO
₹250
In stock · 170 available
PublisherC.S.R.PRACHURANALU
LanguageTelugu
ముందుమాట "పఠనీయతాగుణం పుష్కలంగా కల్గిన నవలలు" 'అంపశయ్య' నవీన్ ప్రతి నెలా ఒక చిన్న నవలను పాఠకులకు అందించాలన్న లక్ష్యంతో 'ఈనాడు' గ్రూపాఫ్ మేగజైన్స్ వారు 'చతుర' మాసపత్రికను 1978లో స్థాపించారు. 'చతుర'లో ప్రచురణకు వారు కొన్ని కఠిన నియమాలను రూపొందించి, 'చతుర'లో తమ నవలల్ని ప్రచురించుకోవాలనే ప్రతి నవలాకారుడు ఆ నియమాల్ని తు.చ. తప్పకుండా పాటించాలని వారు సూచిస్తుండేవారు. చాలాకాలం 'చతుర' మాసపత్రికకు చలసాని ప్రసాదరావు సంపాదకత్వం వహించారు. ఆయన సంపాదకులు సూచించిన ఏ ఒక్క నియమాన్ని పాటించకపోయినా ఆ నవలలో ఇతరత్రా విలువలున్నా దానిని ప్రచురించేవాడు కాదు. ఇంత కఠినంగా వ్యవహరించటం వల్ల 'చతుర' ప్రచురించిన చాలా చిన్న నవలల్లో ఏదో ఒక సామాజిక సమస్య పాఠకులను ఆలోచింపజేసేలా చిత్రించబడ్తుందని నవలా ప్రియులు భావించే వారు. చలసాని ప్రసాదరావు చనిపోయిన తర్వాత 'చతుర'కు నియమించబడిన ఇతర సంపాదకులు కూడా 1978 నుండి అనుసరిస్తున్న విధానాన్నే అనుసరిస్తుండటం వల్ల 'చతుర'లో ఎప్పుడూ మంచి నవలల్నే ప్రచురించటం జరుగుతోంది. సి.ఎస్.రావు ఇప్పుడు ఈ పుస్తకంలో చేర్చిన ఈ నవలలు కూడా 'చతుర'లో వెలువడినవి కావడం గమనార్హం. సి.ఎస్.రావు మన సాహిత్యంలో తనదైన ముద్రను సాధించాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రచయితకు ఒక ప్రాతినిధ్య రచన ఉంటుంది. ఆ రచయిత ఎన్ని నవలలు రాసినా, ఎన్ని నాటకాలు రాసినా, ఎన్ని కథలు రాసినా వాటిల్లో బహుళ ప్రచారాన్ని పొందిన ఒక రచననే విమర్శకులుగానీ, పాఠకులుగానీ పదేపదే చెబుతుంటారు. సి.ఎస్.రావు విషయంలో 'ఊరుమ్మడి బతుకులు' అనే రచననే ఆయన ప్రాతినిధ్య రచనగా చెబుతుంటారు. సి.ఎస్.రావు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే రచన 'ఊరుమ్మడి బతుకులు.' సి.ఎస్.రావు 'ఊరుమ్మడి బతుకుల్ని' మొదలు కథగా రచించాడు. తర్వాత దానిని రచయితే నాటకంగా మలచాడు. తర్వాత అదే పేరుతో ఈ రచన బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో చక్కని ఆర్ట్ సినిమాగా రూపొంది అనేక అవార్డుల్ని గెలుచుకుంది. ఈ రచనతో సి.ఎస్.రావు అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల్ని గొప్ప అవగాహనతో, సానుభూతితో, విప్లవదృష్టితో చిత్రిస్తాడన్న ఖ్యాతిని తన స్వంతం చేసుకున్నాడు. 'ఊరుమ్మడి బతుకులు'కు సి.ఎస్.రావు ఇచ్చిన ముగింపు పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, గొప్ప కొసమెరుపుగా కథానికా సాహిత్యంలో నిలిచిపోయింది.