
CHINTAKINDI MALLAYYA MUCHHATA
₹144
In stock · 22 available
PublisherCHAAYA RESOURCES CENTRE
LanguageTelugu
ఆమె పాదాలు దేహ పరిసరాల శుభ్రత ముగించుకున్నాక, అమ్మ ఇచ్చిన టీ తీసుకుని ముందుగదిలోకి వచ్చాను. పక్కనే పేపరున్నా తీయబుద్ధి కాలేదు. ఆస్వాదిస్తూ టీ తాగడం నాకిష్టం. సూర్యుణ్ని మరికొంత స్వాగతిద్దామని కిటికీ తెరిచాను. పక్షుల రవాలు వినిపించలేదు. సముద్రపు అలల ఘోష అంతకన్నా కాదు. అప్పటికే మొదలైన వాహనాల వేడి నిట్టూర్పులు వినలేనట్టుగా చెవి పెడచెవిన పెడుతోంది. కాసింత చల్లగా, మరికాస్త వెచ్చగా ఉన్న గాలి వద్దంటున్నా ముంగురులను ముద్దాడుతోంది. తన్మయత్వంతో కళ్లు క్షణం మూసి తెరిచాక- ఎదురింటి బాల్కనీలో ఓ రెండు కళ్లు కనబడ్డాయి. మరో పాతిక క్షణం తర్వాత, ఆ కళ్లు అమర్చబడివున్న దేహం కనబడింది. ఆ నేత్రాలు స్వచ్ఛంగా ఉన్నాయి. తలంటుకొని వచ్చి, కురులను ఆరబెట్టుకుంటోంది. వాటి పొడవు కొలవాలంటే ఎంత పెద్ద స్కేలు కావాలో! నేను ఆమెనే చూస్తున్నాను. క్షణంలో వెయ్యోవంతు సేపు మా కళ్లు కలుసుకున్నాయి. సెకనులో రెండు వందలవ వంతు తేడాతో సునీతారాణి కామన్వెల్త్ బంగారు పతకం మిస్ అయ్యిందంటే, నాకు నమ్మాలనిపించలేదు. అంత షార్ట్ టైమ్ ఏంటో నాకు అర్థంకాలేదు. ఒక వేళ ఆమె వైపు నేను కన్నార్పిగాని చూసివుంటే ఇంత చిన్న నిజం నాకెప్పటికీ అర్థమయ్యుండేది కాదేమో! 'ఎవరబ్బా ఈ కొత్త వ్యక్తి?' అనుకున్నాను. ఓ వారం రోజులు ఇంట్లో లేకపోవడంతో పరిసరాల మార్పు తెలియలేదు. ఖాళీగా ఉన్న పోర్షన్లోకి కొత్తగా అద్దెకు దిగినట్టున్నారు. "ఏరా, స్నానానికి నీళ్లు పెట్టమంటావా?" అమ్మ పిలవడంతో, నా ఆలోచనా ప్రవాహం దారి మళ్లింది. ఆ రెండు బకెట్ల నీళ్లతోనే జలకాలాడి, టిఫిన్ తిని, పనిమీద బయటికి వెళ్లాను.