
CHIRANJEEVI SAHITYA SAMALOCHANAM
₹150
In stock · 184 available
PublisherJAGADA PUBLICATIONS
LanguageTelugu
నా మాట నేను యిలాటి పుస్తకం ఒకటి రాయగలుగుతాననిగాని, రాస్తాననిగాని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండానే ఆ ఆలోచన వచ్చింది, వచ్చిందే తడవుగా నా శక్తిసామర్థ్యాలను కూడా లెక్కచెయ్యకుండా తప్పక రాయాలని నిశ్చయం చేసుకున్నాను. ఈ ఆలోచన చిరంజీవిగారికి చెప్పగానే "పోనీ పాపం, ప్రయత్నం చేసి చూడనీ" అనుకున్నారో ఏమో చిరునవ్వుతో తలపంకించి తమ ఆమోదం తెలిపారు. కానీ అప్పటికే చిరంజీవిగారి ఆరోగ్యం ఏమీ బాగా లేదు. నేను రాసినంత వరకు తీసికెళ్ళి వినిపించేదాన్ని ఆయన తృప్తి చెందినట్లు అనిపించేది కాదు. కానీ 'శ్రీకృష్ణశిరోభారం' వినిపించగానే తృప్తి చెంది సంతోషించారనిపించింది. అందుకే అంతవరకు రాసిందంతా తీసేసి మళ్ళీ కొత్తగా రాశాను. ఈసారి బాగా తృప్తి చెందారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తూ వచ్చింది. ఎలాగైనా ఈ పుస్తకం పూర్తి చేసి ఆయన చేతుల్లో పెట్టాలని ఆశపడ్డాను. సుధామ రాసిన ముందుమాట కూడా వినిపించాను. విని ఆనందించారు. నేను ఎంత తొందరపడి రాసినా, ఆయన యింకా తొందరపడి వెళ్ళిపోయారు. పుస్తకం వ్రాతపని పూర్తయి ఆ రోజు డి.టి.పి.కి వెళ్ళాలి. ఇంతలో అసుకోని ఈ సంఘటన జరిగిపోయింది. చిరంజీవిగారి రచనలన్నీ అభ్యుదయ భావాలతో, కమ్యూనిస్టు భావజాలం (అవుట్లుక్)తో వుంటాయి. ఆ సిద్ధాంతాలను నమ్మి ఆచరించిన వ్యక్తి, కమ్యూనిజానికి ప్రేమ, త్యాగం మూలస్తంభాల్లాంటివి. ఆ రెంటికీ తోడుగా కరుణరసం కూడా మమేకమయి నడుస్తుంది వారి రచనల్లో. ఈ మూడింటి కలయికవల్లా రచనలలో మానవత్వం పరిమళిస్తూ పాఠకుల, శ్రోతల హృదయాలను ఆర్ద్రపరుస్తుంది. చిరంజీవిగారి రచనలన్నీ ఒకచోట చేర్చి తేటతెల్లంగా విపులీక రించాలన్న నా తాపత్రయంలో ఏవైనా తప్పులు దొర్లి వుంటే సహృదయులైన పాఠకులు అది రచనలలోని దోషం కాదని, దానిని సరిగా వ్యక్తీకరించలేని నా అశక్తత అని భావించి మన్నించగోరుతున్నాను. పోతే ఆయన రచనలలోవి రెండు పుస్తకాలు ఎంత ప్రయత్నించినా లభించలేదు. 1. ముళ్ళగులాబి (నవల) 2. 'రెండు జాతీయనాటకాలు' ఇది రేడియో నాటకాల సంకలనం.