
COMMUNIST YODHUDU CHANDRA RAJESWARA RAO JEEVANA GAMANAM
by DR.KILAARU PURNACHANDRA RAO
₹350
In stock · 144 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కా|| చండ్ర రాజేశ్వరరావుగారి శతజయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించాము. రాష్ట్ర నలుమూలలా సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించాలని పిలుపునిచ్చాము. ప్రారంభోత్సవ సభ బాగా జరిగింది. సి.ఆర్. గారి సమగ్ర జీవిత చరిత్ర లేకపోవడం వెలితిగా ఉందనిపించింది. స్వీయ చరిత్ర వ్రాయటానికి సి.ఆర్. గారు సుముఖంగాలేరు. కారణం వారనుకున్నది చెప్పేవారు. చరిత్ర వాస్తవాలను దాయాలనే మనస్తత్వం ఉన్నవారు కాదు. పదాలు గుంభించి అసలు విషయం చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి వ్యతిరేకం. చరిత్ర వక్రీకరించడం తెలియని వారు సి.ఆర్. వారి రాజకీయ జీవితంలో అనేకసార్లు అంతర్గతపోరు జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగిన చర్చలు విభేదాలు - వారి వారి విధానాలు వారి సమాధానాలు లేదా విభేదించిన ఘటనలు చాలా చెప్పాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాబోలు శ్రేయోభిలాషి ఒకళ్ళు మీ జీవిత చరిత్ర వ్రాయకూడదా అని అడిగినప్పుడు ఏమి వ్రాయమంటారు! విభేదాలు అంతర్గత చర్చలు బయటికి చెప్పడం ద్వారా రాబోయే తరానికి విషపు గుళికలివ్వాలా? అని ఆవేదనతో అన్న మాటల నేపథ్యం మనం గమనించాలి. పేరుమోసిన కొంతమంది నాయకులు చరిత్ర వక్రీకరించి పాక్షిక సమాచారాలను గ్రంథస్తం చేసినవి పుంఖానుపుంఖాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ చేదు అనుభవాలను పరిశీలిస్తే వారి అభిప్రాయం సబబేకావచ్చు కానీ వాస్తవాలు మరుగునపడితే చరిత్రకు న్యాయం జరుగుతుందా? ఇది "విత్తు ముందా - చెట్టు ముందా” అన్న మీమాంసకు దారితీస్తుంది. అంత పెద్ద మహనీయుడి అభిప్రాయాలతో విభేదించే సాహసం నేను చేయడం మంచిది అవునో కాదో పాఠకులు చెప్పాలి. నాకు మాత్రం ఏదో ఒక పద్ధతుల్లో చారిత్రక సత్యాలను గ్రంథస్తం చేయడమే మంచిదని అభిప్రాయపడుతున్నాను. నేను గుంటూరు విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర వహించే రోజులలో విద్యార్ధి కార్యకర్తలం 7, 8 మందితో ప్రత్యేక సమావేశం కా॥ సి.ఆర్. గారితో జరిగింది. విద్యార్ధి ఉద్యమాన్ని రక్షించుకోవడానికి నిర్మాణ పోరాటం ఉండాలన్న చర్చ వచ్చింది. విద్యార్థులకు కూడా జనసేవాదళ్ శిక్షణ యివ్వాలని సూచించారు. అప్పుడు గుంటూరు విద్యార్దులకు సంఘ వ్యతిరేకశక్తుల మధ్య గొడవలుండేవి. ఇక మేము కూడా సి.ఆర్. గారి సల హాను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులతో వాలంటీర్లను తయారు చేసుకున్నాము. అది ఆచరణలో ఉద్యమ రక్షణకు బాగా ఉపయోగపడింది. ఒక రాష్ట్ర సమితి సమావేశంలో నేను చర్చలో పాల్గొని బయటికి వస్తున్న తరుణంలో కా|| సి.ఆర్. గారు నన్ను పిలిచి పెద్దవారిని విమర్శించేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించవయ్యా అని చనువుగా చెప్పారు. ఆ మాటలు ఇంకా నా చెవులలో రింగుమంటూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు గీతదాటుతూనే మరలా సర్దుకుంటున్నాను. కా|| సి.ఆర్. శతజయంతి సందర్భంగా (1914 - 2014) సి.ఆర్.గారి బయోగ్రఫి తయారుచేయాలనే పట్టుదల నాకు పెరిగింది. అయితే అందుకు సహకరించేది ఎవరు? అని ఆలోచిస్తుండగానే డా॥ పూర్ణచంద్రరావు తారసపడ్డారు. ఎ.ఐ.ఎస్.ఎఫ్ లో ఆయన నా కన్నా సీనియర్. హైదరాబాదులో వ్యవసాయ కళాశాలలో చదువుతూ కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు జీవన గమనం 5