DIDDUBAATALU by V.V.N.MURTHY Telugu book cover

DIDDUBAATALU

by V.V.N.MURTHY

₹300
In stock · 4 available
PublisherTANA PRACHURANALU
LanguageTelugu
ప్రచురణకర్తల మాట తెలుగు సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావు వ్రాసిన, ఆంధ్ర భారతి పత్రికలో 1910లో అచ్చయిన, దిద్దుబాటు కథని తొలి తెలుగు కథగా చాలాకాలం భావించాం. ఇటీవల ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తూ, ఆచంట సాంఖ్యాయన శర్మ వ్రాసిన లలిత, భండారు అచ్చమాంబ వ్రాసిన స్త్రీవిద్య- ఇలా ఒక్కొక్క కథ లభ్యమవుతూ వచ్చాయి. ఏది తొలి తెలుగు కథ అన్న విషయాన్ని తేల్చుకోవడం కన్నా, దిద్దుబాటుకు ముందు వచ్చిన కథలను సేకరించడం అవసరమని భావించారు ప్రముఖ కథారచయిత వివినమూర్తి. దీనికి ఆయన పాటించిన నియమం, వ్రాసిన రచయితగాని, అచ్చువేసిన పత్రిక సంపాదకులుగాని కథ అనడం. ఆ ప్రయత్నంలో ఇప్పటికి 92 కథలు సేకరించారు. ఇవికాక ఇంకా కొన్ని కథలు ఉండవచ్చు, భవిష్యత్తులో బయటపడవచ్చు. ప్రస్తుతానికి ఇవి. వీటి గుణగణాలను, రూపనిర్ణయాలను పాఠకులకు, విమర్శకులకు వదిలిపెట్టి, లభ్యమైనంతవరకు మూలసమాచారాన్ని పరిశోధకులకు అందుబాటులో ఉంచడం అవసరమని మా భావన. తెలుగుభాష, సంస్కృతులను పోషించి, పరిరక్షించుకోవాలన్న ఆశయంతో 1977లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆవిర్భవించింది. గత మూడున్నర దశాబ్దాలుగా ఈ ఆశయసిద్ధికై అమెరికాలోనూ, తెలుగు నేలపైనా అనేక కార్యక్రమాలకు తానా మద్దతునిస్తోంది. ప్రచురణలో లేని, ప్రచురణ కాని ముఖ్యమైన తెలుగు పుస్తకాలను ఉత్తమ ప్రమాణాలతో ప్రచురించి పాఠకులకు అందుబాటులోకి తేవాలన్న ముఖ్య ఉద్దేశంతో తానా ప్రచురణలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేంకటాధ్వరి రచించిన చంపూ కావ్యం విశ్వగుణాదర్శము, శ్రీ వెల్చేరు నారాయణరావుగారు రచించిన తెలుగులో కవితావిప్లవాల స్వరూపం, 59 మంది కథకుల కథ నేపథ్యం (రెండు సంపుటాలు) ఇప్పటికి ప్రచురించాం. శ్రీ కొడవళ్ళ హనుమంత రావు వితరణ, శ్రీ 'నవోదయ' రామ్మోహనరావు, శ్రీ వాసిరెడ్డి నవీన్ల సహృదయత, శ్రమ దానం, తానా కార్యవర్గం, తానా ఫౌండేషన్, మరెందరో హితోభిలాషుల సహకారంతో ప్రారంభమైన ఈ ప్రయత్నం మరిన్ని మంచి పుస్తకాలను మనకందరికీ అందిస్తుందని మా ఆశ.