DUMBU CORTOON by BUJJAI Telugu book cover

DUMBU CORTOON

by BUJJAI

₹40
In stock · 764 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చిరంజీవి 'డుంబు' ఇంతగా మన ఊహలు పెరిగిన తర్వాత... ఇన్ని పత్రికలు పుట్టుకు వచ్చిన తర్వాత... ఎంతో అందంగా ముద్రించే ఇన్ని సదుపాయాలు చేతికి చిక్కిన తర్వాత... పిల్లల పుస్తకాలు, పిల్లల కోసం పత్రికలు, పిల్లల కోసం కొన్ని వందలమంది రచయితలు, రచయిత్రులు అవతరించి ఇలా విజృంభించడం మొదలైన తర్వాత... పిల్లల కోసం భారీ ఎత్తున మహోత్సవాలే జరగడం మామూలే అయిపోయిన తర్వాత... కంప్యూటర్లు సైతం చిన్నతలల కోసం చిందులు వేయడం నేర్చుకున్న తర్వాత... గీతల్లో ప్రాణం ప్రవేశించి కదిలే బొమ్మల కథలు టన్నుల్లో రావడం మొదలైన తర్వాత... ఇప్పుడు... ఇటువంటి వేళ 'డుంబు' ఎవరంటే... 'డుంబు' సృష్టికర్త ఎవరంటే అందరూ క్షణంలో చెప్పలేకపోవచ్చు. కాని.... యాభై ఏళ్ళ వయసున్న వాళ్ళు ముప్పై, నలభై ఏళ్ళుగా పత్రికలు తిరిగేస్తున్న వాళ్ళు... 'డుంబు' అంటే ఒకనాడు బాలాంధ్రాన్ని తన వెంట పరుగులు తీయించిన కార్టూన్ బాల హీరో అని, ఆ పాత్రను సృష్టించిన శిల్పి 'బుజ్జాయి' అని చెప్పగలుగుతారు. ఒక్కసారి జ్ఞాపకాల తెరవెనుకకు తప్పుకొని మురిసిపోతారు. 'డుంబు' ఆగడాల్ని తల్చుకొని మదిలో నవ్వుకుంటారు. 'డుంబు' సృష్టించిన బుజ్జాయి... మల్లెలు, సంపెంగలు, పారిజాతాలు గుబాళించే తెలుగు పాటల 'కృష్ణశాస్త్రి' గారి కుమారుడని. బుజ్జాయి బొమ్మల కథలు 'ధర్మయుగ్'లో ఇంగ్లీషు 'ఇలస్ట్రేటెడ్ వీక్లీ'లో ఇంకా ఎన్నెన్నో పత్రికలలో అలా ధారావాహికంగా వెలువడ్డాయని అందరికీ తెలుసు. తన జీవితాన్ని బాలలకే అంకితం చేసుకున్న బుజ్జాయి కుంచెలో నుంచి, కలంలో నుంచి పిల్లల కోసం పాతిక పుస్తకాలు పూశాయి. 'డుంబు' ఆంధ్రప్రభ కోసం ఆంధ్రప్రభలో పుట్టాడు. ఇప్పటికీ ఉన్నాడు. డుంబు చిరంజీవి. అలాగే... బుజ్జాయి గుండెల్లో 'బాలుడు' పదిలంగానే ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు. ఆ కుంచె, ఆ కలం అలా సాగిపోతూనే ఉంటాయి. ఉండాలి... ఇన్నేళ్ళకు 'డుంబు'ని ఇలా పుస్తకంలో బంధించడానికి ఓ మంచి ప్రయత్నం... 'డుంబు'కి, 'బుజ్జాయి'కి, 'విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్' వారికి జేజేలు... 1996 వి. వాసుదేవ దీక్షితులు (ఆంధ్రప్రభ పూర్వ సంపాదకులు)