ENDARO MAHANUBHAVULU - 200 by DR.AVASARALA VINJAMURIANASUYA DEVI Telugu book cover

ENDARO MAHANUBHAVULU - 200

by DR.AVASARALA VINJAMURIANASUYA DEVI

₹200
In stock · 5 available
PublisherDR.AVASARALA VINJAMURIANASUYA DEVI
LanguageTelugu
అక్షరాల వెనుక ఆలోచన ఈ పుస్తకం ఎందుకు రాయాలనిపించిందంటే... ఒకరోజు రాత్రి ఎందుకో నిద్ర పట్టక రకరకాల ఆలోచనలు వచ్చాయి. తొంభై ఏళ్ల జీవిత పుటలు వెనక్కి తిప్పి చూసుకున్నాను. ఇన్నేళ్ల నా కృషికి వచ్చిన అవార్డులు, ప్రశంసా పత్రాలు, పలువురు పెద్దల విలువైన ఆటోగ్రాఫులూ, ఫోటోగ్రాఫులూ, ఎందరో నా మీద రాసిన పద్యాలూ, నేను కర్ణాటక సంగీత నొటేషన్తో రాసిన భావగీతాలు, జానపద గేయాల ఏడు పుస్తకాలూ, నా జీవితాను భవాల ఆధారంగా రాసిన రెండు పుస్తకాలూ, ప్లస్ యిప్పుడు రాసిన 'ఎందరో మహానుభావులు' (మొత్తం పది పుస్తకాలు) - ఇవన్నీ నా అనంతరం ఏమవుతాయి? ఎవరికి కావాలి! ఎవరింట్లో పెట్టుకుంటారు! ధనం కంటే విలువైన వీటిని పొందుపరచడం ఎలాగని ఆలోచించాను. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో దాచుకుంటాం కదా! అలాగే నేను పైన వివరించిన వాటి గురించి ఓ పుస్తకం రాసి అందులో దాచుకుంటే పదిలంగా ఉంటాయనిపించింది. నా జీవితంలో ఎందరో మహానుభావుల్ని కలసి, వారి మన్ననలు, ఆశీస్సులు పొందే అదృష్టం నాకు చిన్నతనంలోనే లభించింది. వారందరూ నన్ను ప్రభావితం చేసినవారే! మామయ్య కృష్ణశాస్త్రి భావగీతాలు నాకు చిన్నప్పుడే నచ్చి, ఆ పాటలకి ట్యూన్స్ పెట్టి నా తొమ్మిదవ ఏట నుంచి పాడడం వల్ల, మ్యూజిక్ కంపోజర్ని అయ్యాను. కాకినాడ నుంచి పిఠాపురం రెండెడ్ల బండిలో ప్రయాణాలు, పొలాల్లో పాటలు, అప్పటి జాతర్లు, కలాపాలు, చెక్క భజన్లు, తోలుబొమ్మలాటలు- వివిధ జానపద రూపాలు నన్నాకర్షించి జానపదగేయ సేకరణకి దారితీసి, నేనొక ప్రసిద్ధ జానపద గాయనిగా రూపొందాను. మంచి వాతావరణంలో మెలగడం, కవితా గోష్ఠుల మధ్య పెరగడం, పలువురు పెద్దల్ని కలవడం, వారి సమక్షంలో పాడడం, నన్నొక సంస్కారవంతురాలిగా తీర్చిదిద్దాయి. ప్రసిద్ధి కెక్కిన అలనాటి ప్రఖ్యాత గాయకుల సంగీతం విని, విని నా సంగీత విద్యను పెంపొందించుకున్నాను. అన్నింటి కంటే, భగవంతుని దయ నా మీద ప్రసరించి, సంకల్పసిద్ధురాలినయ్యాను. ఏ మాత్రం ఓపిక లేని తొంభై ఏళ్ల వయసులో, నడుం నొప్పి, చేతి వేళ్లునొప్పి, సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఆవేశపూరితమైన శక్తిని ప్రసాదించి, నా చేత యీ రచన చేయించిన వేంకటేశ్వరస్వామికి ప్రణామాలతో కూడిన కృతజ్ఞతలు. అనారోగ్య పరిస్థితులలో, ఉద్యోగపు బాధ్యతలతో తీరుబడి లేకపోయినా, నా కోసం సమయాన్ని వెచ్చించి, ఎంతో శ్రమనోర్చి యీ పుస్తకాన్ని ఎడిట్ చేసిన నా పౌత్ర సమానుడు రెంటాల జయదేవకు ఆశీర్వచనాలతో కూడుకున్న కృతజ్ఞతలు.