GANAPATHI - 150.00 by CHILAKAMARTHI LAKSHMI NARASIMHAM Telugu book cover

GANAPATHI - 150.00

by CHILAKAMARTHI LAKSHMI NARASIMHAM

₹150
In stock · 119 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
"భరతఖండంబు చక్కని పాడియాపు హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి" బిపిన్ చంద్రపాల్ ఆంగ్లేయుల దౌర్జన్యాలనూ, కుటిల రాజనీతిజ్ఞతనూ, భారతీయులను గురిచేస్తున్న దోపిడీ విధానాలనూ తీవ్రంగా దుయ్యబడుతూ, రాజమహేంద్రవరంలో 5 రోజులపాటు ఇచ్చిన ఉపన్యాస సారాంశానికి చిలకమర్తి ఇచ్చిన పద్యరూపమే ఇది. భారతీయతను పుణికిపుచ్చకుంటూ ఆంగ్లపాలకులపై నిప్పులుమిసిన కలం ఆయనది. "భరతఖండంబె యొక గొప్ప బందిఖాన” అంటూ నాటి దేశ పరిస్థితులకెత్తిన వాస్తవికతా పతాక ఆయన గళం. చెన్నపట్నంలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు (1914) వెళ్లి ప్రముఖల ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన దేశాభిమాని, విజయనగరం, కృష్ణా తదితర మండల కాంగ్రెస్ సభలకు హాజరై ప్రజల్లో దేశభక్తి, స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించే రాజకీయ కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. సంస్కరణ భావాల ప్రచారంలో సాంప్రదాయ పీఠాధిపతుల ఆజ్ఞలను సైతం లెక్కపెట్టని సంస్కర్త. వీరి జీవితాన్ని పోలవరం జమీందారు, న్యాపతి సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం గార్లు ప్రభావితం చేశారనవచ్చు. వీరేశలింగం తాత్వికతే చిలకమర్తిని సాహిత్యపరంగానూ ముందుకు నడిపించింది. చిలకమర్తి నడిపించిన సరస్వతి మానపత్రిక (1898). మనోరమ మాసపత్రిక (1906), దేశమాత వారపత్రిక (1909)ల్లో సాహిత్య, రాజకీయ వ్యాసాలుండేవి. బ్రిటీష్ ప్రభుత్వం 'దేశమాత' చందాదారులపై విధించిన ఆంక్షలకు నిరసనగా పత్రికనే ఆపేసి తిరగబడ్డారు చిలకమర్తి. "ధనమునకై బానిసగ నుండుట కిష్టపడలేదు" అని రాసుకున్నాడు. స్త్రీ విద్య, వితంతు వివాహాల సమస్యలపై పోరాడిన వ్యక్తి. మతసామరస్యం కోసం కృషి చేశాడు. నిమ్న జాత్యుద్ధరణ ఆశయంగా 1909లో హరిజనుల కోసం విద్యాలయాన్ని నడిపిన సంస్కారి. ఎక్కడ ఏ కొంచెం అభ్యుదయ భావాలున్నా ఆహ్వానించిన వ్యక్తి. అయితే గ్రాంధికవాదిగా జీవితమంతా గడపడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం వీరి 'స్వీయ చరిత్ర'ను ముద్రించి సమర్పిస్తూ చేసిన సన్మాన సభలో అరసం నాయకులు చిలకమర్తివారి ఈ అంశాన్ని వారితోనే సవినయంగా ఖండించారు. (1944). అలాగే ఓ ప్రవాసనంలో కొత్త కవిత్వాన్ని కూడా “తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన బెట్టి కుదుమగాను క్రింద మంటపెట్ట ఉడకకేంచేస్తుంది. దాని కడుపు కాల ధరణలోని” అంటూ ఎద్దేవా చేయడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేశారు. శతకాలూ, కథలూ, ప్రహసనాలూ, జీవిత చరిత్రలూ, స్వీయ చరిత్ర, విద్యార్థుల కోసం పాఠ్యగ్రంథాలు, నాటకాలూ, నవలలు అన్నిటా తన ముద్ర వేశారు. ప్రముఖ నవలా రచయితగా "ఆంధ్ర స్కాటు" అన్న ఖ్యాతి గడించారు. నాటక రచనలో ప్రధానంగా గయోపాఖ్యానం (1890) అందులోని పద్యాలు నిత్యం తెలుగువాళ్ళ నాలికలమీదే జీవిస్తుంటాయి. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లిలో 26-9-1867న పున్నయ్యగా జన్మించి 'లక్ష్మీ నరసింహం'గా ప్రశస్తి పొంది 17-6-1946న రాజమహేంద్రవరంలో మరణించారు. చిన్నతనంలో రేచీకటితో ఆరంభమైన కంటిచూపు 1911 నాటికి పూర్తి గుడ్డిగా పరిణమించింది. అడొచ్చిన ఆటంకాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధించిన ధైర్యశాలి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సత్కారం పొందిన "కళాప్రపూర్ణుడు". నాటకాన్ని ప్రజాస్వామ్యీకరించడంలోనూ, నవలల్లో తెలుగుదనం నింపడంలోనూ, సమకాలిక సామాజిక పరిణామాల ఎగుడుదిగుడులను - సునిశిత పరిశీలకుడైన చరిత్రకారుడుగా చేర్చి స్వీయ చరిత్రను రూపొందించడంలోనూ చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగువాడి జోహార్లకు పాత్రుడు. హాస్యం ఆరోగ్యవర్థకం, ఆరోగ్యవర్థకమైన హాస్యం మానసికోల్లాస ప్రవర్థకం. చిలకమర్తి శబ్దాశ్రయ హాస్యానికి వారి "లండన్ సంకల్పం" మచ్చుతునక. ఇక గణపతి చిలకమర్తికి హాస్య వాఙ్మయ నిర్మాతగా స్థానం కల్పించిన వస్తుగత హాస్య నిర్భరం. గణపతిలో మూడుతరాల కథ ఉంది. గణపతిని ఆలంబనంగా చేసుకొని చిలకమర్తి నాటి విద్యా విధానాన్ని పాఠకులముందుంచారు. సాంప్రదాయ ధోరణిని విమర్శిస్తూ, కొత్త సంస్కృతి నాటి యువతను వేషభాషల్లో ఆచార వ్యవహారాల్లో ప్రభావితం చేస్తున్న తీరును, న్యాయసంబంధమైన ఆచరణలో ప్రజలకు ఎదురవుతున్న కష్టనష్టాలను విశదీకరించారు. గణపతి ఒక అధిక్షేపాత్మక నవల. భిన్నపాత్రల ద్వారా సామాజిక దురాచారాలకు అద్దం పట్టంది. "ఆశాపిశాచావిష్కుడు, ఒరులకపకారము చేయదలచువాడు తప్పక తానే చెడును" అన్న నీతిని చాటిన హాస్య రసస్ఫోరక నవల గణపతి. తెలుగువాళ్లు నలుగురు ఒక చోట చేరినపుడు హాయిగా నవ్వుకొనే ఆస్కారం కలిపించే నవల గణపతి. తెలుగింటి మొదబ్బాయికి మారుపేరు గణపతి.