GATHI THARKIKA BOUTHIKAVADAM by V.CHENCHAIAH Telugu book cover

GATHI THARKIKA BOUTHIKAVADAM

by V.CHENCHAIAH

₹70
In stock · 2 available
PublisherV.CHENCHAIAH
LanguageTelugu
మనసులో మాట విరసం గతంలో ప్రతి సంవత్సరం వేసవి పాఠశాలలు నిర్వహించేది. 1986 వేసవిలో కృష్ణా జిల్లా పల్లెర్లమూడి గ్రామంలో పది రోజులపాటు మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం అనే అంశాలపై వేసవి పాఠశాల జరిగింది. అయితే చలసాని ప్రసాద్ తప్ప తక్కిన ఇద్దరు వక్తలూ రాలేమని చెప్పడం వల్ల బాధ్యతంతా ఆయనపైనే పడింది. మార్క్సిజం పాఠాన్ని నన్ను చెప్పమని 20 రోజుల ముందు ఆయన నాకప్పగించాడు. ఆ మాట వినడంతోటే నా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. మరుక్షణంలోనే ఆ పిడుగు పూలవాన కురిపించినట్టయింది. మార్క్సిజం అంశంపైన మూడు రోజులపాటు పాఠం చెప్పాలా అని ఆశ్చర్యం వేసింది. అప్పటికి ఒక్కసారే మార్క్సిస్టు తత్వశాస్త్రం పాఠం విని ఉన్నాను. అంతకు మించి పెద్దగా చదివింది కూడా లేదు. మార్క్స్, ఏంగెల్స్ రచనల్ని ముందేసుకుని ఆ ఇరవై రోజులపాటు రాత్రింబవళ్ళు చదవాల్సి వచ్చింది. చదివి అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఒకవైపు ఉన్నా, తత్వశాస్త్రంపైన ఆసక్తి రోజురోజుకూ పెరగసాగింది. వివరంగా నోట్సు రాసుకుని తయారయ్యాను. మొత్తం మీద మూడు రోజులూ పాఠం చెప్పాను. గండం గడిచింది. ఆనాటి నుండి తత్వశాస్త్ర అధ్యయనంపై ఆసక్తి అలాగే కొనసాగింది. అనేక సందర్భాల్లో తత్వశాస్త్రంపై పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది. ఎంత చదివినా తత్వశాస్త్రం ఒక తరగని గనిలా అనిపించింది. తత్వశాస్త్రాన్ని సులభ శైలిలో సాధారణ పాఠకులకు అందుబాటులో ఉండే విధంగా రాయాలని కొంతకాలంగా నా మనసులో ఉన్న ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. చదివేటప్పుడు పాఠకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇంగ్లీషు కొటేషన్లు, రెఫరెన్సుల జోలికి పెద్దగా వెళ్ళలేదు. విషయాన్ని సూటిగా, ఆసక్తి కలిగే విధంగా చెప్పడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. మార్క్సిస్టు మహోపాధ్యాయుల రచనల్ని నేరుగా చదువుకోడానికి ఇదొక సోపానంగా ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశం. మార్క్సిస్టు తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం గతితార్కిక భౌతికవాదం. ప్రస్తుతానికి దీనికే పరిమితమవుతున్నాను. పాఠకుల అవగాహన కోసం ప్రాచీన, ఆధునిక భావవాద, భౌతికవాదాలలోని విభిన్న ధోరణుల గురించి కూడా క్లుప్తంగా వివరించాను. ఇది స్థూలపరిచయం మాత్రమే. నా మిత్రుడు, ఆక్యుపంచర్ వైద్యుడు డా|| ఎం.ఎస్. బాలాజీ ప్రారంభిస్తున్న రామకుప్పం ప్రచురణలలో ఇదే మొదటిది కావడం నాకు యాదృచ్ఛికంగా లభించిన అవకాశం.