GILIGINTHALU by TULASI BALAKRISHNA Telugu book cover

GILIGINTHALU

by TULASI BALAKRISHNA

₹100
In stock · 71 available
PublisherTULASI BALAKRISHNA
LanguageTelugu
రారోయి మా యింటికీ... నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా నేనూ, నా భార్యా తన యింటిముందు దిగబడిపోయినా, ఏ మాత్రం యిబ్బందినీ తన మొహంలో చూపించకుండా, అత్యంత ఆనందాన్నే వ్యక్తపరిచాడు మా కొలీగ్ అవతారం. ఆర్నెల్లుగా 'మీ దంపతులు మా యింటికి రావాలీ' అంటూ తను చెవిలో యిల్లు కట్టుకుని పోరుతూంటే ఇప్పటికి కుదిరింది మాకు. ఆప్యాయంగా నన్ను పొదివి పట్టుకుని, మా యిద్దర్నీ యింట్లోకి తీసుకెళ్లి, భార్యనీ, కూతుర్నీ, కొడుకునీ పరిచయం చేసాడు. “ఇన్నాళ్లకు దయ కలిగిందన్న మాట మా మీద" అంటూ. "ఫోనన్నా చెయ్యకుండా వచ్చేసాం. సండే ఈవెనింగ్ కదా పాపం మీరు ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకున్నారేమో?" అంది నా భార్య, మర్యాదకోసం. నాలిక కరిచిపెట్టి, మొహం అడ్డంగా ఆడిస్తూ, "ఛ ఛ ఛ - ఏమీ లేవు. మీరు మా యింటికి రావడం, మీ వంటి కళాభిమానులు మా అమ్మాయి సంగీతం విని, మా అబ్బాయి బ్రేక్ డాన్సులు చూడ్డమే మా ప్రోగ్రాం" అని అంటూనే, కూతురుతో "బేబీ - స్టార్టు చెయ్" అన్నాడు అవతారం. పిల్లలు ఇద్దరూ భారీకాయులు. తల్లి పోలికట. వాళ్లలోని కళ కూడా అంత 'భారీ'గానూ వుంటుందేమో చూడాలని మాకు ముచ్చటనిపించింది. "పాడమ్మా- ఏం సిగ్గుపడఖ్కర్లే...” అని ఆ అమ్మాయితో మా ఆవిడ అంటూండగానే - ఆహారాన్ని అందుకోవడానికి గభాలున నోరు తెరచిన హిప్పో పొటమస్ లాగా ఒక్కసారిగా దవడల్ని మేక్సిమమ్ పాసిబుల్ ఎక్స్టెస్ట్ తెరచి, ఫ్యాక్టరీ సైరన్ గొంతుతో, "సా..." అంటూ ఆ పిల్ల ప్రారంభించే సరికి, సోఫాలో తృళ్ళిపడ్డాం మేమిద్దరం. శ్రోతల్ని విపరీతంగా 'కదిలించే' శక్తి వున్న కళాకారిణి తన అనుంగు పుత్రిక అని అర్ధం చేసుకున్న వాడైన అవతారం, "మా బేబీవి సణుగుళ్లు, మూల్గుళ్లు కావు.