
GODAVARI PUSHKARALU - NAA ANUBHAVALU
₹30
In stock · 58 available
PublisherDR.SAPPA DURGA PRASAD
LanguageTelugu
గోదావరి పుష్కరాలు - నా అనుభవాలు యుగ యుగాల, తర తరాల సంప్రదాయ జలనిధి నా గోదావరి. ఎక్కడో నాసికాత్రయంబకంలో జలధారగా పుట్టి, మంజీర, ప్రాణహిత, పూర్ణా, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి వంటి ఎన్నో ఉపనదులనూ, వాగులను, వంకలను తనతో కలుపుకొని, విసృతమై, విరాజమానమైన విశాల జలనిధి నా గోదావరి. నాసిక్ సన్నని జలధారగా, త్రయంబకంలో నెలవై, పంచవటిలో పావనమూర్తియై తన తీరం వెంట నింగిలో దేవతలకు నెలవై, భాసరలో భవ్యమై, కాళేశ్వరంలో కానరానంత పెరిగి, భద్రాచలాన బంధించలేనంత విశ్రుతమై, పాపికొండలలో వయ్యారపు వంపు తిరిగి, కొండలను ముంచేసేంతలోతైన తనగుండెలతో పావన రాజమహేంద్రిని వింత అందాలతో సుదూర తీరంగా ఉరకలెత్తి పరుగులు తీసే నాగోదావరి ననుగన్న తల్లి. ఎన్నో బీడుభూములను సస్యశ్యామలంగా తీర్చి, పసిడి పంటలుగా మార్చి ఈ తీరంలో నివసించే వారికేగాక భారతావనిలోని ఎందరికో అన్నం పెడుతున్న అందాల జలథి నాగోదావరి అందుకే నేనంటాను నా చేతిలో అన్నముద్ద నా గోదావరి నా కడుపులో చల్ల నా గోదావరి నా శక్తి, నాయుక్తి, నాధీశక్తి నా గోదావరే నా బలం, నా భాగ్యం, నాతలరాత నా గోదావరే ఈ తల్లి ఋణం తీర్చుకోలేనిది. అందుకే... ఎన్ని జన్మలెత్తినా, ఈ తల్లి ఒడిలో పుట్టి, ఈ తల్లి ఒడిలో పెరిగి, ఈ తల్లికి సేవచేసి, ఈ తల్లికి నావంతు సేవగా విశ్వవ్యాప్త కీర్తిని అందించి, ఈ తల్లి ఒడిలో కలిసిపోయే భాగ్యం కల్గించవయ్యా భగవాన్!' అని ప్రార్థిస్తూ.... నాసిక్ లో జలతారు ధారగా పుట్టిన నాతల్లి గోదావరి రాజమహేంద్రిని పసిడి ప్రవాహమై విరాజిల్లుతోంది. మా అమ్మ గోదావరికి తన తోబట్టువులలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క వత్సరం వంతున పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే పన్నెండు రోజుల పండుగ ఇది. అనాది ఆచారం అదే పుష్కరం. అదే అదే గోదావరి పుష్కరం. అదే మా తీరవాసులందరికి పన్నెండేళ్ళ పండుగ. నా ప్రాంతం, నా రాష్ట్రం, నాదేశ వాసులకే గాక ప్రపంచ ప్రజలందరికీ మోక్షాన్ని, పుణ్య ఫలాన్ని అందించే పన్నెండు రోజుల పండుగ. జీవించి ఉన్న వారికేగాక నా వంశమూల పురుషుల తరం నుండి నిన్నటి తరం వరకు తరించిన వారందరికీ పేరు పేరునా సద్గతులు శాశ్వతం చేసే పండుగ రోజులు గోదావరి పుష్కర పర్వదినాలే. ఇదే ఆది, అనాది ఆచారం.