GUNTURU KAVULU by SURYADEVARA RAVI KUMAR Telugu book cover

GUNTURU KAVULU

by SURYADEVARA RAVI KUMAR

₹150
In stock · 12 available
PublisherSURYADEVARA RAVI KUMAR
LanguageTelugu
ప్రస్తావన గుంటూరు జిల్లా అటు చారిత్రకంగా, ఇటు సాంస్కృతికంగా రెండు వేల సంవత్సరాల నుండి ప్రసిద్ధి పొందుతూ ఉంది. శాతవాహన చక్రవర్తులు ఈ జిల్లాలోని ధరణికోట (అమరావతి) ను తమ రాజధానిగా ఏర్పరచుకొని సాంస్కృతిక వైభవంతో పరిపాలించారు. అంతకు పూర్వమే ఆచార్య నాగార్జునుడు ఈ జిల్లాలోని నాగార్జున కొండ వద్ద నివసించి బౌద్ధధర్మ ప్రచారాన్ని గావించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ గడ్డ అసంఖ్యాక మేధావులకు పుట్టినిల్లయింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో పుట్టటంవలన గానీ, ఈ జిల్లాలో ఆదరింపబడటంవలన గానీ తమ కవితా ప్రస్థానాన్ని సాగించిన కవులను గురించి స్థూలంగా వివరించటమే ఈ రచనోద్దేశము. ఈ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గల వంగిపురం గ్రామం పూర్వం వంగిపట్టుగా పిలువబడేదని, క్రీ.శ. 10 వ శతాబ్దంలో ఈ గ్రామ నివాసియైన భీమనప్పయ్య కుమారులైన పంపన కన్నడ రాజుల నాశ్రయించి ఆదిపురాణము, విక్రమార్జున విజయము అన్న కావ్యాలను వ్రాసి 'కవితాగుణార్ణవ' బిరుదాంకితుడైనా డని, ఇతడి తమ్ముడు 'జినవల్లభుడు' కవిజనాశ్రయకర్త మల్లియరేచనకు ప్రాణమిత్రు డని, అలాగే కన్నడ భాషలో ఛందోంబుధీ, కాదంబరి గ్రంథాలను రచించిన నాగవర్మ కూడా ఈ వంగిపురవాసుడేనని దిట్టకవి లక్ష్మీనరసింహాచార్యులు 'వంగిపుర చరిత్ర'లో వ్రాశారు. అయితే వీరు తెలుగులో కవిత్వం చెప్పినట్లు తెలియరాలేదు. క్రీ.శ.1125 నాటి ఈమని (దుగ్గిరాల మండలం) శాసనకర్త అయిన కవి అయితన, క్రీ.శ.1138 ప్రాంతంలో వెలనాటి గొంకరాజు వద్ద గల కంటెడు అన్న శాసనకవి వంటి ఎందరో శాసనకవులు ఈ జిల్లాకు చెందినవారే. క్రీ.శ. 1145 నాటి చేబ్రోలు శాసనములో 'దేపటిపండు' అన్న కవి “దేశి మార్గములు మట్టువడం గవిత్వము చెప్పనేర్చె" నని ఉన్నది. అయితే ఇతడు చెప్పిన కావ్యాల పేర్లు తెలియరాలేదు. క్రీ.శ. 1151 నాటి బాపట్ల భావనారాయణస్వామి దేవాలయ శాసనము ననుసరించి అనంతపండితుడను వ్యక్తి 'నారాయణీయము'నకు వ్యాఖ్య రచించినట్లు తెలుస్తున్నది.