
HAKKULA PATRAM
₹60
In stock · 27 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
హక్కులను అక్కున చేర్చుకున్న మనిషి మానవ హక్కుల ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన సామాజిక కార్యకర్త బుర్రా రాములంటే మొత్తం తెలుగు జాతికి ఎంతో గౌరవం వుంది. అలుపెరుగని పోరాటం అన్న మాటకు నిలువుటద్దమాయన. నిజాయితీకి, నిబద్ధతకు, నిమగ్నతకు గీటురాయి రాములన్న, విద్యార్థిగా, ఉద్యోగిగా, ఉద్యమకారుడుగా, విప్లవోద్యమ నేతగా, ఆచార్యుడుగా, మానవహక్కుల నేతగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. బుర్రా రాములు మరణం ఆలోచనాపరులందరిని కలిచి వేసింది. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం మొత్తం సమాజం తరఫున నిలబడ్డ బుర్రా రాములు మరణించడం ఎంతో మందిని శోకసముద్రంలో ముంచింది. ప్రశ్నను జోకొట్టవద్దని, ప్రశ్నను నిలబెట్టి హక్కుల కోసం విల్లులా ఎక్కుపెట్టమన్న రాములు లాంటి వ్యక్తుల భర్తీని పూడ్చటం సామాన్యమైన విషయం కాదు. బుర్రా రాములులాంటి వ్యక్తులు జన్మించడానికి కాలం కూడా సమయం పడుతుందని చెబుతుందనుకుంటా. అందరిలాగే మాకూ గుండెనిండా బాధ వున్నది. రాములులాంటి హక్కుల యోధుడు లేకపోవటం ఈ నేలకు ఎంతో నష్టం. ప్రజాస్వామిక వ్యవస్థలకు ఒక ప్రమాద హెచ్చరిక. గత మూడు దశాబ్దులుగా పోరుగలైన ఓరుగల్లులో జనగర్జనల గళకంఠాల పక్షాన నిలబడి నిత్య నిర్భంధ నీడలను ప్రశ్నించిన హక్కుల యోధునిగా ఆయన ఈ సమాజంపై బలమైన ముద్రవేశారు. దశలవారీగా ఎదుగుతూ ఆయన మానవ హక్కుల ఉ ద్యమకారుడిగా పరిపూర్ణ మానవుడై నిలిచాడు. అన్ని అస్తిత్వ ఉద్యమాలను అక్కున చేర్చుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిలబడ్డాడు.తెలంగాణ నేలకు అన్యాయం చేస్తున్న ఇంటి దొంగలను ఎత్తి చూపాడు. సీమాంధ్రకు చెందిన పెట్టుబడిదారులను అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. మానవ హక్కుల ఉద్యమం చేతపట్టి తెలుగునేలంతా తిరిగాడు. దేశవ్యాపితంగా జరుగుతున్న హక్కుల ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. ప్రజలకు అవసరమైనవాటిని అందించటం, ప్రజలకు అందాల్సినవి అందకుండా చేస్తున్న శక్తులను గుర్తించి ప్రశ్నించి నిలవటమే జ్ఞానులు చేసే పని. ఆ పనినే తన జీవిత కర్తవ్యంగా పెంచుకుని ముందుకు సాగిన వాడు బుర్రా రాములు. విప్లవోద్యమ చెట్టు ఆకుల దగ్గరనుంచి మానవ హక్కుల ఉద్యమంలో పూస్తున్న పూల వరకు ఆయనకున్న పరిచయాలు చెప్పలేనివి. ఆయన ప్రయాణం సుదీర్ఘమైనది. బుర్రా రాములు మిత్రుల అనుభూతులు, పరిచయాలు, ఆయనతో కలిసి వేసిన పోరాట అడుగులు, గతితర్కం పాఠాలు, ఉద్యమ సాహసాలు, వ్యక్తిత్వానికి, ఆచరణకు సంబంధించిన విషయాలను కలిపి ఒక పుస్తకం తేవాలని, అది కూడా వెంటనే తేవాలని తలంచాం. రచయితలు ఆప్యాయంగా వెంటనే రచనలు పంపడం వలన మూడు, నాలుగు రోజుల్లోనే ఈ పుస్తకాన్ని మీకందించగలిగాం. బుర్రా రాములు తన జీవితాన్నే ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహనీయుడు. ఆయనకిదే మా నివాళి.