
HUMANIST MANIFESTOLU - MANAVAVADA PRANALIKALU
₹40
In stock · 1 available
PublisherHEMA PUBLICATIONS
LanguageTelugu
హ్యుమనిస్టు మానిఫెస్టో - 1 ఆధునిక ప్రపంచమంతటా మతవిశ్వాసాలలో సమూలమైన మార్పులను విరివిగా గుర్తించాల్సిన కాలం ఆసన్నమైంది. సాంప్రదాయిక దృక్పథాలను కేవలం పునర్విచారణ చేసే కాలం గతించింది. ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో మార్పు పాత విశ్వాసాలను బద్దలు కొట్టింది. విస్తారంగా అభివృద్ధి చెందిన జ్ఞానానుభవాల దృష్ట్యా ప్రపంచమంతటా మతాలు క్రొత్త పరిస్థితులకు, నియమ నిబంధనలకు లోనవుతున్నాయి. మానవుడి ప్రతి కార్యరంగంలోని ఉద్యమంలో హ్యూమనిజం ఒక స్పష్టమైన పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. మతవాద హ్యూమనిజాన్ని మరింతగా అవగాహన చేసుకునే క్రమంలో క్రింది సంతకం దారులమైన మేము వర్తమాన జీవనరంగ నిర్వహణలోని వాస్తవికాంశాల దృష్ట్యా కొన్ని నిశ్చిత నిర్ధారణలు చేయగోరుతున్నాం. 20వ శతాబ్దంలో మానవజాతి సమస్యల పరిష్కారంలో మతం అనే పదం, దాని అనుబంధ సిద్ధాంతాలు గుర్తింపును కోల్పాయాయి, శక్తిహీనాలయ్యాయి. ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన చివరి ఘట్టంగా తలపోస్తున్నాం. జీవితపు ఉన్నత విలువలు గుర్తించడమే మతాల పరమార్ధంగా ఉండేది. మనచుట్టూ వున్న పరిస్థితులను (లౌకికంగానో లేక పారలౌకికంగానో) వ్యాఖ్యానించడం, అందువల్ల ఒనగూడే విలువల గురించి జ్ఞానం (లక్ష్యంగానో, ఆదర్శంగానో) అవగతమై జీవన సాఫల్యమార్గం సిద్ధించేది, దాంతో వాటి లక్ష్యం నెరవేరేది. అయితే ఈ కారకాల్లోని మార్పులన్నీ మతం యొక్క బాహ్య స్వరూపంలోని మార్పుల వల్లనే సిద్ధించేది. శతాబ్దాల తరబడి మతాల్లో సంభవించిన మార్పు ఈ వాస్తవాన్నే విశదీకరిస్తుంది. ఇన్ని మార్పుల సంభవించినా, శాశ్వత విలువల జిజ్ఞాసవిషయంలో మతాలు జడప్రాయంగానే ఉన్నాయి. మానవ జీవనంలో ఇది ఒక అవిభాజ్యమైన లక్షణంగానే కొనసాగుతుంది. నేటి మానవునికి లభించిన విస్తృత విశ్వపరిజ్ఞానం, అతడి వైజ్ఞానిక విజయాలు, అతడు ఆశిస్తున్న సౌభాతృత్వం, దానిపట్ల అతడి గణ్యత మతానికి క్రొత్త లక్ష్యాన్ని, ప్రయోజనాలను వ్యాఖ్యానించవలసిన అవసరం కల్పిస్తున్నాయి. అందుకే గతాన్ని పూర్తిగా అధిగమించి, తగిన సామాజిక లక్ష్యాలు నిర్దేశించి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగల ఒక సూటి అయిన, శక్తివంతమైన, భయరహితమైన మతం ఒకటి కావాలి. సాంప్రదాయిక మతాలకు మనం ఎంతగా ఋణపడి ఉన్నప్పటికీ, ఈ మతాలన్నీ ఏ ఒక్కటిగానీ, కలసికట్టుగా కానీ నేటి పరిస్థితులకు ఏ మాత్రం చాలవు. వర్తమాన యుగావసరాలకు తగినవిధంగా వీటిని మలుచుకోవాలి. అటువంటి మతాన్ని స్థాపించడం నేటి ప్రధాన అవసరం. నేటితరం మీదున్న ప్రధాన బాధ్యత. అందువల్ల మేము ఈ క్రింది నిర్ధారణలు చేస్తున్నాం.