IDI CHARITRA by M V R SASTRI Telugu book cover

IDI CHARITRA

by M V R SASTRI

₹350
In stock · 1 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
ISBN9788192936550
ఎందుకీ చరిత్ర? కౌరవులకూ పాండవులకూ మధ్య కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతున్నది. యుద్ధ వివరాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి రిపోర్టు చేయటానికి మనిషి కావలసి వచ్చాడు. అటూ ఇటూ పోరాడుతున్నది తన ఆత్మబంధువులే. అయినా ధృతరాష్ట్రుడు ఎవరు గెలిచినా తనకొకటే అనుకునే రకంకాదు. దాయాదులపైన తన కొడుకులే గెలవాలని మనసారా కోరుకునేవాడు. పైగా గుడ్డివాడు. అలాంటి వాడికి కబుర్లు చెప్పడం ఏమి కష్టం? తన కుమారుల పక్షం అద్భుతంగా వీరవిహారం చేసేస్తున్నదంటే ముసలిరాజు సంతోషపడతాడు. కాబట్టి అతడికి ఇంపుగా ఉండే రీతిలో స్వపక్ష ప్రతాపాన్ని ఎక్కువ చేసి వైరిపక్ష విజయాలను తక్కువ చేసి చెబితే సరిపోదూ? ఈ కాలపు సర్కారీ జర్నలిస్టులనో, బతక నేర్చిన ఆస్థాన చరిత్రకారులనో ఎవరిని అడిగినా 'ఔను. అంతే కదా' అనే అంటారు. కాని భారత ఇతిహాసాన్ని రచించిన వేదవ్యాసుడు అలా అనుకోలేదు. ధృతరాష్ట్రుడికి యుద్ధాన్ని రిపోర్టు చేసే డ్యూటీకి ఆయన ఏరికోరి సంజయుడిని సెలక్టుచేసి, ఆ పని అతడు చక్కగా నిర్వర్తించటంకోసం రెండు తెఱంగులవారి దివారాత్ర ప్రవర్తనంబులు గనునట్లును, రహస్య ప్రకార భాషణంబులు వినునట్లును, మనోవృత్తంబు లెఱుంగునట్లును వరంబిచ్చి యతి శీఘ్ర గమనంబు నొసంగి... ననుగ్రహించెను'- ట! ఆ పక్షంవారు, ఈ పక్షంవారు పగలు, రాత్రి ఎలా ప్రవర్తించారో, ఏమి రహస్యాలు మాట్లాడుకున్నారో ఎవరి మనసులో ఏముందో తెలుసుకుని తలచినంతనే ఎక్కడికైనా వెళ్ళగలిగేట్టు - విషయ సేకరణనో చరిత్ర రచననో చేసేవారికి వరాలివ్వటానికి ఈ కాలంలో ఏ వ్యాసుడూ లేదు. అంతటి దివ్య శక్తులతో నిర్దుష్టంగా వాస్తవ ఘటనలను చరిత్ర కెక్కించటం మానవసాధ్యం కాకపోవచ్చు. కాని ఉన్న శక్తిని, ఉన్నపాటి బుద్ధినయినా సక్రమంగా వినియోగించి, కళ్లెదుట కనిపించే యథార్ధాన్ని గుర్తించి, విదేశీగంతలను అవతలపారేసి జాతిచరిత్రను జాతీయదృష్టితో అవలోకించగలగటమైనా మన చరిత్రకారులకు చేతవుతున్నదా?