JANANI JANMA BHOOMISCHA by GOPARAJU SEETADEVI Telugu book cover

JANANI JANMA BHOOMISCHA

by GOPARAJU SEETADEVI

₹25
In stock · 39 available
PublisherSANGAMITHRA PRACHURANALU
LanguageTelugu
జననీ, జన్మభూమిశ్చ పశ్చిమగోదావరి జిల్లా, ఒకనాటి నర్సాపురం తాలూకా, ప్రస్తుత పోడూరు మండలంలోని కవిటం గ్రామం మాది. అయితే 1915లో నేను తూర్పుగోదావరిజిల్లా కోటిపల్లిలో మాతామహుల యింట్లో జన్మించాను. మా గ్రామం పెద్దదైన గోదావరి కాలువ (సుమారు 40 మైళ్లపొడవుగల విజ్జేశ్వరం-నర్సాపురం కాలువ) ఒడ్డున వున్న గ్రామం. సర్ ఆర్ధర్కాటన్ గోదావరిపై 1853లో ఆనకట్టను నిర్మించారు. తదనంతరం త్రవ్వినకాలువలలో ఇది ఒక ప్రధానమైన కాలువ. ఇది 1873లో త్రవ్వినట్లు కవిటం లాకుమీద వుంది. కవిటం మహిళాసంఘం భవనం (గీతాభవనం) ప్రక్కనే ఒక పెద్ద తూము వుంది. అందుపై అది నిర్మించబడిన సంవత్సరం 1880 అని చెక్కబడివుంది. అంటే పంటకాలువ త్రవ్విన 7 సంవత్సరాలకు ఈ డ్రైనేజి కాలువ త్రవ్వారన్నమాట. వెంకయ్య అనే కాంట్రాక్టరు ఈ పెద్ద కాలువ త్రవ్వించాడు గనుక దీనిని వెంకయ్య కాలువ అని కూడా పిలుస్తారని మా పెద్దలు చెప్పేవారు. మొక్కపాటి నరసింహశాస్త్రిగారు రచించిన ప్రఖ్యాత హాస్యనవల "బ్యారిష్టర్ పార్వతీశం"లో లండన్ వెళ్లడానికి బ్యారిష్టర్ పార్వతీశం మొగలితుర్రునుండి బయలుదేరి నర్సాపురంలో మెయిల్ బోటు ఎక్కి నిడదవోలు చేరిన కాలువ యిదే. ఆ విధంగా ఇది తెలుగు సాహిత్య చరిత్రలో ప్రసిద్ధమైన కాలువ. కవిటం గ్రామం ఎప్పుడు పుట్టబడిందో వివరంగా తెలియదు. ఊళ్లో శివాలయం సోమేశ్వరస్వామి ఆలయం వుంది. అది 1650 ఆ ప్రాంతాలలో నిర్మించబడినట్లు చెప్పబడుతూవుంది. అంటే సుమారు 300 ఏళ్లపైబడిన వయస్సు మా గ్రామానికి వుందన్నమాట. గోదావరి కాల్వ రాకపూర్వం గ్రామంలో అంతా మెట్టపైరులే. జొన్న, ప్రత్తి వగైరాలు పండించేవారని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ గ్రామ ఆయకట్టులో ప్రత్తిబీడు అనే పేరుగల పంట భూములున్నాయి. ఆ రోజుల్లో బ్రాహ్మణ కుటుంబాలలో స్త్రీలుకూడా పొలాలకు వెళ్లి గోంగూర వగైరాలు తెచ్చుకొనేవారట. ఎవరు ఎంత పొలం దున్నుకుంటే అంతా వారిదేనని, ఏడాదికి ఎకరాకు రూపాయి పన్నువుంటే అదీ కట్టలేక చేలు వదలివేసేవారని పెద్దలు చెబుతూ వుండేవారు. వర్షాధారం పంటలు గనుక వ్యవసాయం అభివృద్ధి అప్పుడు అంతగాలేదు. గోదావరి కాల్వలు వచ్చిన తరువాత జిరాయతీపల్లం భూములు, ఏటేటా పంటలు వచ్చాయి. ఇంచుమించు అన్నీ యీనాము భూములే.