
JANULU MAHAJANULU
₹100
In stock · 82 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పాఠకోత్తములకు వినతి ఇదిగో! ఇంకో అద్భుత గ్రంథం మీ చేతుల్లో ఉంచుతున్నా. శ్రద్ధగా చదవండి! రక్తం ఉప్పొంగుతుంది. హృదయం ద్రవిస్తుంది. మీ మనో నేత్రాలముందు మధ్యయుగాల విజ్ఞానచరిత్ర యొక్క చిత్రవిచిత్రవర్ణ విశోభిత పటం విప్పారుతుంది! మూఢవిశ్వాసాలు, అసహనం, గతానుగతికత్వం అనే గాఢతిమిరంనుంచి శాస్త్రవిజ్ఞానమనే వెలుగులోకి పాశ్చాత్యదేశాల్లో మానవుడు తడుముకుంటూనే పురోగమిస్తూన్న కాలం అది! తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ! అని ముక్త కంఠముతో మానవుడు వెలుగెత్తి గానం చేసిన దినములవి! అట్టి రినైజాన్సు యుగ దృశ్యాలు, మానవుని పునరుజ్జీవన యుగం పాఠకుని కనులముందు ప్రదర్శితమవుతూంది. అంతకు వేల సంవత్సరాల క్రిందట భారతీయ ఋషులు ముక్తకంఠంతో గానంచేసిన దాని బలహీనమైన ప్రతిధ్వనియే, ఇది కావచ్చు! దీనిలో యెన్నో దృశ్యములు, రంగములు, యెందరో కథానాయకులు వున్నారు. ఇండియా, ఇంగ్లాండు, ఇటలీ, బైజాంటియం, ఫ్రాన్సు, సమీప ప్రాచ్యదేశాలు. రష్యా మొదలైన దేశాలకు మనం యాత్రలు సాగిస్తాము. పశ్చిమాన మరో కొత్తఖండాన్నీ, తూర్పున సైబీరియా విశాల ప్రదేశాల్ని కనిపెడతాము. పారిస్, ఫ్లోరెన్సు, ఆక్సుఫోర్డు, మాస్కో, బాగ్దాద్, బొఖారా నగరాల్లో మానవులు పరిశోధించడం పఠించడం, వర్తకం చేయడం, వ్రాయడం, గృహనిర్మాణం చేయడం, గుణించడం, గణించడం మొదలైన కృషులలో నిమగ్నులు కావడం చూస్తాం. కోపర్నికస్, బ్రూనో, కొలంబస్, ఎర్మాక్, రోజర్ బేకన్, లియోనార్డో ఆదిగాగల మహాజనులతో మనము పరిశ్రమిస్తాం. ఆలోచిస్తాం, తపిస్తాం, కలలు గంటాము! మహారణ్య మధ్యంలో సుందర నగరాలు నిర్మించడం చూస్తాం. ప్రపంచ వ్యాపారమార్గాలు అంతకంతకు సమ్మర్ధములగుట పరికిస్తాం. మొట్టమొదటి కర్మాగారాలు జైలుదేరడం కనుగొంటాము. తన యింటి మాట ఎటున్నా దేవునికి శిలాదేవాలయాలు నిర్మించడం గమనిస్తాం. పరిసరాలు పరిస్థితులు మారడంతోబాటు మానవుని భావాలు మారడం చూస్తాము, విశ్వరూపాన్ని గూర్చీ, సృష్టి స్వభావాన్ని గూర్చీ చెప్పబడుతూన్న పురాతన భావనలను సాహసులైన మేధావంతులు యెదిరించుతూ, శాస్త్రాలోచనా స్వాతంత్య్రమును నిరోధించువారి ధూర్త దౌష్ట్య మూర్ఖత్వాల నెదిరిస్తూన్న కాల మది! ప్రకృతిశక్తుల నర్థం చేసికొని, విజయాన్ని సాధించడంలో మానవుడు పెద్ద ముందంజలను వేసిన యుగమది! అట్లు చేయుటలో మానవుని దిఙ్మండలం విస్తృతమై, మన ఆధునిక యుగానికి బాటను సుగమం చేసింది.