
JEEVANA GEETALU
₹50
In stock · 11 available
PublisherDR.UNDELA MALAKONDAREDDY
LanguageTelugu
ISBN02104156
ఒక్కమాట పద్యం సాహితీమద్యం. తెలుగు భాషకు మణిభూషణం. ఆదికవి నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అల్లసాని పెద్దన, ప్రభృతులు తెలుగు నుడికి పద్యాల ద్వారా వన్నె చిన్నెలు సొగసులు అద్దారు. రాజాస్థానాలలో ప్రజా హృదయాలలో గౌరవ స్థానం కల్పించారు. పద్యంలో సంగీతం అంతర్లీనంగా వుంది. అది అధారంగా తెలుగు పద్యనాటకాలు పద్యాన్ని సామాన్యుల హృదయ వీణల్లో మ్రోగించగలిగాయి. సినిమాలు వచ్చిన తర్వాత గేయం పద్యం స్థానాన్ని ఆక్రమించుకొంది. పద్యం పండితులకు, సాహితీవేత్తలకు పరిమితమౌతున్నది. అయినా దాని వైశిష్ట్యం దానికున్నది. చేయి తిరిగినకవి, లలిత సరళ పద్యాలతో అందరినీ రసాబ్ధిలో ముంచ గలడనడం అతిశయోక్తి కాదు. గేయం ఆబాలగోపాలాన్ని అలరింపజేస్తున్నది. డా॥ దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి గారలు తక్కినకవులెందరో తెలుగులో గజళ్లు రచించి పాడించి గేయాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లారు. “గజల్” శ్రీనివాస్ తెలుగు గజళ్లకు తన గాన మాధుర్యాన్ని, అభినయాన్ని జోడించి ప్రపంచ వ్యాప్తంగా రసజ్ఞులను ఆనందడోలల్లో ఊగించడం నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కవిహృదయాన్ని పండితపామర జనరంజకంగా ఆవిష్కరించడం శ్రీనివాస్‌కు వెన్నతో పెట్టిన విద్య. అతని గజల్ విన్యాసం చూచినప్పుడు నాకు కల్గిన స్ఫూర్తియే యీ "జీవన గీతాలు" రచనకు నన్ను పురికొల్పింది. ఇది నా ప్రథమ ప్రయత్నం. రసజ్ఞులు దీనిని దృష్టిలో ఉంచుకొని, గీతాలను చదువగలరని ఆశిస్తున్నాను. ఈ గీతాలపై తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలువరించిన మహాకవి డా|| సి. నారాయణ రెడ్డి గారికి, సహజకవి డా॥ మల్లెమాలగారికి, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, విద్వత్కవిశేఖరులైన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి నా హృత్పూర్వక కృతజ్ఞతా వందనాలు. ఇందులోని ప్రతి గీతంలోని భావాన్ని ఆవిష్కరించే రేఖా చిత్రాలను రమణీయంగా చిత్రించిన ఆచార్య టి. సాయి కృష్ణ గారికి నా కృతజ్ఞతలు.