
JEEVITHAM OKKATE YUDDHALU ANEKAM
₹100
In stock · 19 available
PublisherNEMALURI BHASKAR RAO
LanguageTelugu
ISBN03123651
ఊపిరి తరంగాలు నక్సల్బరీ భూమిమీద ఎంత పట్టుతో వున్నదో గాలీ వెలుగూ వెన్నెలలనూ అంత పట్టించుకున్నది. పునాదిని కుదిపింది. ఉపరితల భావజాలాన్ని ఉర్రూతలూపుతూ వున్నది. అందుకు కారణం అది శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం వెలుగులో వచ్చింది. అందువల్లనే నూరు పూలు వికసించి వెయ్యి ఆలోచనలు ఘర్షణ పడడం, కేంద్రాన్ని బద్దలుకొట్టే పునాది ప్రజా చైతన్య ఆలోచనలు, నూతన మానవుని ఆవిష్కరణ కొరకు తపన, వ్యవస్థపై తిరుగుబాటు చేసే క్రమంలో తనను తాను విప్లవీకరించుకోవడం... ఈ ఉద్య మంలో ఉజ్వలంగా కనిపిస్తాయి. ఈ అన్వేషణ. ఈ అభివృద్ధి సహజంగానే సరళరేఖలా కాక అటుపోటులుగా... ఏకముఖంగా కాక విస్తృతంగా మొనాటనీగా కాక వైవిధ్యంగా వ్యక్తమయ్యాయి. వెనుకబాటు మనస్తత్వంగల రైతాంగం నేల నెచ్చెలి నిట్టూర్పులు విని పలుగూ సారా తిరగేస్తే తమ నెత్తురు ఇంకిన నేలలోంచి ఏ నెత్తావులను ఎగజిమ్మగలరో, ఎంత ముందుచూపు ప్రదర్శించగలరో కూడా రాజకీయ సంచలనమే కాదు. ఈ దశాబ్దకాలపు సాహిత్య సాంస్కృతిక సంఘర్షణ చూసినా వాసన పట్టగలం. మావో ఆలోచన తాత్త్యికరంగాన్ని భయ సంకోచాల నుంచి విముక్తంచేసి, ఆలోచించడానికి సాహసించమని ఆదరించి చూపకపోతే విప్లవ జీవితంలోనూ, పోరాటంలోనూ ఇంక గగుర్పాటు, పులకింత ఉండేవి కావు. ఉద్యమ నెలవంక లోంచి శివసాగర జలపాతాలు దూకేవికావు. అజ్ఞాత సూరీని పాట వెన్నెలమీద నడిచేదికాదు. భూమి, సూర్యుడు, చంద్రుడు పరస్పరాకర్షణానుబంధంలో తిరుగుతున్నట్లే విముక్తి పోరాటమూ, విప్లవ రాజకీయ నాయకత్వమూ, పాటా పెనవేసుకొని మునుసాగుతున్నాయి. అజ్ఞాత సూరీని కవితల క్రమాభివృద్ధి చూస్తేనే శ్రీ శ్రీ నుంచో, శివసాగర్ నుంచే నేర్చుకునే క్రమం నుంచి, ప్రజల నుంచి నేర్చుకునే క్రమం దాకా ఎదుగుదల కనిపిస్తుంది. శ్రీ శ్రీ, శివసాగర్ ప్రభావాలతో ప్రారంభమై ప్రజా పోరాటం ప్రభావంతో రాటుదేలడం కనిపిస్తుంది. అజ్ఞాత సూరీని ఒంటరి సాహసాలు ఆకాశానికి వెలుగును కాదుగదా వెన్నెలనూ ఇవ్వలేవని, ప్రకృతిలో భాగమైన సూర్యుని వలె ప్రజల్లో భాగమైన యోధుడే కాంతి అయినా, కవిత అయినా విసరగలడని... పోరాటమే ఆయనకు అవగాహన నిచ్చింది.