JOURNALISTULA KOSAM by GOVINDARAJU CHAKRADHAR Telugu book cover

JOURNALISTULA KOSAM

by GOVINDARAJU CHAKRADHAR

₹70
In stock · 3 available
PublisherMEDIA HOUSE PUBLICATIONS
LanguageTelugu
ఈ శతాబ్ది మొదటి దశాబ్దంనుంచీ తెలుగులో దినపత్రికలుకూడా వెలువడ్డాయి. అంతకుముందు రకరకాల తెలుగు పత్రికలు వచ్చాయి. జర్నలిజం ఒక శాస్త్రంగా, వృత్తివిద్యగా, విద్యగా అవతరించిన చాలా కాలం తరవాత మన విశ్వవిద్యాలయాల్లో బోధన విషయమయింది. కాని శాస్త్రాన్ని ఇంగ్లీషులో చదువుకొని తెలుగులో అర్థంచేసుకోవలసిన పరిస్థితి ఇప్పటికీ ఉంది. తెలుగు బోధన మాధ్యంగా జర్నలిజంనేర్పే సంస్థల సంఖ్య చాలా తక్కువ. ఇటీవలి కాలంలో భాషాసాహిత్య విద్యార్థులకు జర్నలిజాన్ని ప్రత్యేక విషయంగా బోధించటం మొదలయింది. ఇప్పుడిప్పుడే తెలుగులో జర్నలిజాన్ని గురించి వివరించే. గ్రంథాలు వెలువడుతున్నా వాటి పరిధితక్కువ, వ్యాప్తి తక్కువ. ఇంగ్లీషులో వందలకొద్ది గ్రంథాలు లభ్యమవుతుంటే తెలుగులో పదుల సంఖ్యలోకూడా అవిలేవు. ఇలాంటి పరిస్థితిలో గోవిందరాజు చక్రధర్ రాసిన "జర్నలిస్ట్లకోసం" అనే పుస్తకం వెలుగు చూస్తున్నది. గ్రంథకర్తను అభినందిస్తూ గ్రంథానికి స్వాగతం చెప్పవలసివుంది. ఇదో మంచి పరిణామం. ఏభాష ఎప్పుడు పుట్టిందన్నది అంత ముఖ్యవిషయం కాదు. అది లిపి బద్ధమైనప్పుడు కొంత అభివృద్ధి సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ సొంతలిపిలేని భాషలు ప్రపంచంలో వందల సంఖ్యలో ఉన్నాయి. లిపి ఏర్పడ్డ తరవాత భాషా పరిణామం కొంత మందగించినా, అది సాహిత్యదశకు చేరుకొని స్థిరరూపం సంపాదించే ప్రయత్నంలో పడుతుంది. నోటిమాటకన్నా అక్షరరూపంలో ఉన్న మాటకు సమాజంలో గౌరవస్థానముంటుంది. వాగ్రూపంలోని భాష క్రమపరిణామంలో సాహిత్య భాషగా ఎదిగిన తరవాత అంతటితో ఆగిపోదు. మానవసమాజం దాన్ని అన్ని రంగాల్లోనూ భావవ్యక్తీకరణకు ఉపయోగిస్తుంది. భిన్న వృత్తుల్లో సంపాదించిన పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని లిఖిత రూపంలో పెట్టే ప్రయత్నంలో అదొక ప్రత్యేక శాస్త్రంగా, శాస్త్ర భాషగా అభివృద్ధి చెందుతుంది. శాస్త్ర సాహిత్యం ఎంత విస్తృతంగా ఉంటే భాష అంత ఆధునికమవుతుంది. భాషను నవీకరించాలంటే ఆభాష మాట్లాడే సమాజం దాన్ని తనకు తెలిసిన అన్ని రంగాల్లోనూ నోటిమాటల్లో, లిఖిత గ్రంథాల్లో ఉపయోగించాలి.