
KANYASULKAM MALIKURPU 1909 - 250
₹250
In stock · 70 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట ఒక కథగానీ, నాటకంగానీ సజీవంగా ఉండటానికీ, ప్రజల ఆదరణకు నోచుకోడానికీ కారణమేమిటి? సాహిత్యంలో ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇతివృత్తంలోగానీ, పాత్రల్లోగానీ సజీవ లక్షణం ఉండి, సామాజిక వ్యవస్థలో అవి ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ కథగానీ, నాటకంగానీ ప్రజల మన్ననలు పొందుతాయి. గురజాడవారి కన్యాశుల్కం నాటకాన్ని ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారంటే అదే కారణం. "సాహిత్యము ఏ కొందరి సొత్తో యనుకొన్న కాలంలో అది ప్రజల సొమ్మని ఉదారంగా పంచిపెట్టిన సౌమ్యశీలి” గురజాడ అప్పారావు "కవీంద్ర చంద్రుడు" అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డిగారన్నారు. కందుకూరి, గిడుగు, గురజాడ ఆధునికాంధ్ర “సాహిత్య నిర్మితిలో” రాళ్ళెత్తిన మొదటి కూలీలు. కందుకూరి సాంఘిక విప్లవం, గిడుగు భాషా విప్లవం, తనలో “సమన్వయించు" కొని సరికొత్త సాహిత్య, సంస్కరణ విప్లవానికి తెర లేపినవాడు గురజాడ. ఆయన “నవయుగ వైతాళికు"డని ఆధునికాంధ్ర సాహిత్యోద్దండులు కొనియాడారు. తన కావ్యకళ నవీనం, ఇతివృత్తం భారతీయం, జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి, కథా, కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించానని గురజాడవారే చెప్పుకున్నారు. జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానాన్ని “మహోదయం”లో విశ్లేషిస్తూ, ఆయన “చిరంజీవిత్వానికి” కారణమేమిటని ప్రశ్నించుకొని కీ॥శే॥ కె.వి. రమణారెడ్డిగారే జవాబు చెప్పారు. "తన జాతికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఇతర జాతులకు తన జాతి తరఫు రాయబారిగా రావడం” అనగా “ప్రాంతీయ విలక్షణత, సార్వజనీనమైన సామాన్యత్వాన్ని” ప్రతిపాదించడం వల్లనే గురజాడ చిరంజీవైనాడు అని కె.వి.ఆర్. రాశారు. “రచయితగా, పండితునిగా, దేశ భాషా సంస్కరణోద్యమ ఆద్యులుగా లోకములు ఆయనకు హారతులు పడుతుందనీ, ప్రజలు నమ్రతతో, గౌరవంతో జోహారు లర్పిస్తారనీ ఆనాటి గురజాడ సంతాపసభలో జె.ఎ. ఏట్సు అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత అన్నారు. చరిత్రను అభివృద్ధి మార్గాన నడిపించగలిగిన మహా పురుషులలో గురజాడ అప్పారావు కూడా చేరిపోయాడని కె.వి.ఆర్.గారన్నారు.