
KATHA 2018
₹90
In stock · 21 available
PublisherVASIREDDY NAVEEN
LanguageTelugu
అపురూప ఇంటికి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారు. ఇప్పుడు ఇద్దరే మిగిలారు. ఆ హడావిడితోపాటు సంతోషం కూడా మాయమైపోయింది. మెల్లగా బైట కూడా ఒంటరితనం ఆక్రమిస్తున్నది. ఏదో దిగులు. ఇంటి ముందున్న ఖాళీస్థలంలో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. చేతిలో దిన పత్రిక పేజీలు తిరుగుతున్నాయిగానీ నారాయణ మనసు దానిమీద లేదు. బైటి గేటుకు ముఖద్వారానికి మధ్య ఉన్న స్థలంలో అటూ ఇటూ నాటిన రెండు కొబ్బరిచెట్లు, కుడిపక్క మందారం చెట్లు కొద్దిగా ఎదిగి ఉన్నాయి. ఇల్లు మొదలు పెట్టినప్పుడు వాటిని నాటారు. మిగతా జాగా అంతా ఖాళీగానే ఉంది. రెండు మూడు రోజులుగా అక్కడ మనుషులు తొక్కిన అడుగుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇంట్లోంచి కొత్త రంగుల వాసన ఇంకా ఘాటుగా ముక్కుపుటాలకు తాకుతూనే ఉంది. అనుకున్న దానికంటే ఇంటికి రెండు మూడు లక్షలు ఎక్కువే ఖర్చు వచ్చింది. ముందే జాగ్రత్త పడితే ఇంత అయ్యేది కాదేమో. ఇప్పుడు అనుకొని ఏం లాభం? ఇల్లు కట్టడం అంటే మాటలా, నలుగురు మనుషులు తలా ఒక పని అందుకోవాలి. కొడుకు ఉండి ఉంటే అన్నీ చూసుకునేవాడు. అప్పటికీ బిల్డర్కు ఇచ్చాడు. కొడుకు లేని వెలితి బాధిస్తూనే ఉంది. పిల్లాపాపలతో వచ్చే వాళ్లను చూసి కొడుకు కోడలు కూడా బతికి ఉంటే నా ఇల్లు ఎప్పుడూ నిండుగా ఉండేది అని దుర్గమ్మ లోపల వలపోసుకుంటుంది. కొత్తింట్లకు పోవాలన్నప్పటి నుంచి దుర్గమ్మ భర్తను గమనిస్తూనే ఉంది. ఎవరెవరినో పిలిచాడు. ఇండ్లకు పోయి మరీ పిలిచాడు. ఇట్లా ఎవరినీ ఇంటికి పిలిచే సందర్భమే రాలేదు. కొడుకు పెళ్లికి అందరినీ పిలవాలనుకున్నాడు. అవేవీ తమ చేతిలో లేకుండా జరిగిపోయాయి. ఇప్పుడు ఇంట్లోకి పోతున్నాం రాండని పిలవాల్సి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో భార్య అన్న మాట అంతరార్థం స్ఫురిం చింది. ఇంతకూ ఈ ఇల్లు ఎవరికి ఇచ్చిపోవాలి? అని నలుగురు అనుకోరు...? అందుకే చిన్న పూజ కానిచ్చి ఇంట్లోకి వెళ్లామంది.