
KATHA - 2020
₹100
In stock · 13 available
PublisherVASIREDDY NAVEEN
LanguageTelugu
బస్సు హార్న్ చెవుల్లో జొరబడి, సడెన్ బ్రేక్ కి ముందుకు తూలి, మెలకువొచ్చింది. నాతోపాటు ముందు సీట్లలో వాళ్లూ కొంతమంది లేచారు. ఒకళ్లిద్దరు నిలబడి, ముందున్న అద్దాల్లోంచి తొంగి చూస్తున్నారు. 'చిరుతపులి!' ఎవరో అన్నారు. నేను కిటికీలోంచి బైటకి చూశాను. వెలిగే కళ్లూ, మచ్చల తోక... చెట్ల మధ్య మాయమైంది. ఆ మృగం బస్సులో రేపిన అలజడి కాసేపు కొనసాగి మళ్లీ కునుకుల్లోకీ, నిద్రలోకీ సద్దుమణిగింది. బస్సు అడవిలోకి ఎప్పుడొచ్చిందో తెలీదు. నేను నిద్రలోకి వెళ్లకముందు ఇంకా ఊళ్లూ, పొలాలూ కనపడు తున్నాయి. ఇప్పుడు మనిషి ఆధిక్యం ఏమాత్రం లేని దట్టమైన, ఎడతెగని అడవి. చెట్ల కాండాల మీద బస్సు కిటికీల వెలుగు మాయ తివాచీలాగా పాకుతోంది. ఒకచోట, దూరంగా, కొమ్మల వెనుక ఏదో మంట. ఎవరీ అరణ్యంలో చలి కాచుకునేది... చిరుతపులులా? నిజంగా ఇది పంచతంత్రం కథలు జరిగే మాయల అడవిలాగే ఉంది. ఇప్పుడే నిద్రలో అనుభవించిన కల ఏదో గుర్తుకు వచ్చీరాక, తోక అందని తూనీగలాగా కవ్విస్తోంది. ఏంటది... కలలో ఆ దృశ్యం... నేను స్నిగ్ధమైన ఆడ ముఖాన్ని ఒక పొద్దుతిరుగుడు పువ్వులా పట్టుకుని నా ముఖం వైపు మెల్లగా లాక్కుంటున్నాను. ఆ ముఖంపై ముద్దులు, ముద్దుల్లో నా ఆత్రం, చెలమలో నీళ్లు చప్పరించే మృగంలాగ. ఎవరిదా ముఖం? మహతి? ఏదో మర్చిపోయిన సంగతి గుర్తొచ్చినట్టు గుర్తొచ్చింది- ఈ ప్రయాణ గమ్యం... మహతి... ఆమె మళ్లీ నా ఆలోచనలను ఆక్రమించింది... బస్సు చక్రాలకూ రోడ్డుకూ మధ్య కుదిరిన లయలో, సీటు మీద తల ఆడుతూ, మళ్లీ మగతలోకి... కలలోకి... నేను అడవి మధ్యలో రోడ్డు మీద నిలబడ్డానట... అటు చూస్తే బస్సు నన్ను వదిలి వెళ్లిపోతోంది... ఇటు చూస్తే చెట్ల మధ్య నుంచి చిరుతపులి... 'చలి కాచుకుందాం వస్తావా,' అని అడుగుతోంది, ఎవరిదో బాగా తెలిసిన గొంతుతో. భయమేసి మళ్లీ మెలకువొచ్చింది. కిటికీలోంచి చూస్తే, ఒక మైలురాయి మీద మహతి ఉంటున్న ఊరి పేరు కనపడింది. అప్రయత్నంగానే ఆ తర్వాతి మైలురాళ్ల మీద తరిగే దూరపు అంకెని లెక్కపెట్టడం మొదలు