KATHA-2022 by VASIREDDY NAVEEN Telugu book cover

KATHA-2022

by VASIREDDY NAVEEN

₹150
In stock · 10 available
PublisherVASIREDDY NAVEEN
LanguageTelugu
మా మాట మంచికథ జీవితం పత్రికల్లో ప్రచురించగానే ముగిసిపోకూడదని, దానికి శాశ్వతత్వాన్ని కల్పించాలని భావించి 1990 నుండి ఉత్తమ కథలతో వార్షిక కథా సంకలనాలను ప్రచురించటం ప్రారంభించాం. ఈ సంకలనాలకు మంచి ఆదరణ లభించింది; అది కొనసాగుతోంది. ఆనందమే. కానీ కథల నాణ్యత, రాశి చూస్తుంటే ఒకింత బాధ కూడా కలుగుతోంది. 1990లో దాదాపు వందకు పైగా మంచి కథల నుంచి 15 కథలను ఎన్నిక చేయడానికి రోజుల తరబడి చర్చించి మరీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. 1990లో ఆంధ్రజ్యోతి వారపత్రిక 'ఈవారం కథ' శీర్షికన ప్రచురించిన 52 కథల్లో దాదాపు 30కి పైగా మంచి కథలు ఆ వందలో ఉన్నాయి. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'కథ 2022' కోసం 15 కథలను ఎన్నిక చేయడానికి రోజుల తరబడి వెతకాల్సిన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో తెలుగుకథ భవిష్యత్తుపై ఆందోళన సహజంగానే ఏర్పడుతోంది. కానీ ఇంకా ఆశ చావలేదు. ఈ 33 సంవత్సరాలలో కాలం మారింది. సమాజం మారింది. సామాజిక ఉద్యమాల స్వరూపం మారింది, తదనుగుణంగా మనుష్యుల స్వభావాలూ మారాయి. మారిన ఈ లక్షణాలను పట్టుకోవటంలోనూ కథలుగా మలచటంలోనూ మన రచయితలు వెనకబడుతున్నారా? తెలుగుకథా సాహిత్య చరిత్రలో వాసిలోను, రాశిలోను కథలు పలుచబడిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఈ అంతరం (gap) చాలాకాలంగా కొనసాగటమే ఈ ఆందోళనకు కారణం. రకరకాల మాధ్యమాల్లో వెలువడిన 2500 పైచిలుకు కథల్లో ఈ 15 కథలు ఉ త్తమమైనవని మేము భావించి ఎన్నిక చేసినవి. చదవండి, చర్చించండి. సద్విమర్శ, సహేతుకమైన చర్చ సాహిత్యవికాసానికి రెండు కళ్లులాంటివి. దురదృష్టవశాత్తు తెలుగు నేలపై ఇవి మృగ్యమైపోవడం ఒకింత బాధ కలిగించే అంశం. ఈ దుస్ధితి నుంచి తెలుగుకథ త్వరలో బయటపడుతుందని ఆశిద్దాం. *ఇది 33వ సంకలనం. గత ఇరవైనాలుగు సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేకుండా తక్కువ ధరలకే నిరాటంకంగా ఇవి వెలుగు చూడడానికి ప్రధాన కారణం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA). ప్రపంచంలోనే అతి పెద్ద ప్రవాసాంధ్రుల సంఘం తానావారి ఆర్థిక సహాయం వల్లనే ఇది సాధ్యమయ్యింది. ఆ సంస్థకు, తానా పూర్వ అధ్యక్షులు జంపాల చౌదరిగారికి కృతజ్ఞతలు.