
KATHALU MAHANEEYULA KALAM CHITRALU
by ARUDRA
₹100
In stock · 196 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఊరు ఊరుకొంది మంచిగాలివీస్తున్నది. మనుష్యులు నిద్రలేస్తున్నారు. మనుష్యు లెప్పటికైనా నిద్ర లేస్తారా అని కాచుకొని కూర్చున్న యువకుడు కళ్ళు పెద్దవిచేశాడు, చూశాడు. వీస్తున్నగాలికి అతడి దుస్తులు రెపరెపలాడాయి. అతడు ఎదురు చూసే ఆ ముహూర్తాలు ఆగమించాయి. ఆగమించినవి ఆగకూడదని అతడి ఆకాంక్ష. మనుష్యులు నడుస్తున్నారు రోడ్లునిద్రలేస్తున్నాయి. నిన్న మాపటివేళ ఆవలించి కళ్ళుమూసుకొన్న ఆఫీసులు అప్పుడే లేచి ఒళ్ళు విరుచుకొంటున్నాయి. పోటెత్తిన రద్దీ కాలిబాటమీద రాటు తేరుకున్నది, నింపాదిగా ఉన్న తారురోడ్డు జోరుని కూడపలుక్కుంటున్నాది. సంచారం సంకలనం ప్రాక్టీసుచేస్తున్నాది. యువకుడు, మన కథానాయకుడు, రోడ్డుపట్టేడు. అతగాడి బతుకు అంతకుముందే రోడ్లపాలైంది. అందుకు అతడు సానుభూతికొరకు వెతకడు. విపులమైన నెన్నుదురు, కనులలో క్రొంబెదురు, వణుకు గొంతుక, అతడి సంతకం, ఇవన్నీ అతడి ఆనవాళ్ళు. అయితే ఇవి కొద్దికాలం కిందట కాలదోషం పట్టాయి. మునిసిపల్ చెత్తల డబ్బాదగ్గర యువకుడు నిలబడ్డాడు. అందరూ చూస్తూవుండగా అతడు తాను తొడుక్కున్న నిరాశని విప్పేశాడు దాని జేబుల్లోవున్న ఆశాలేశాలని అందరి సమక్షంలో సురక్షితంగా భద్రపరిచాడు. అవి ఒకటి ఆశా, రెండు ఆశయం. ఆ రెంటినీ రొంటిని దోపుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. గుమిగూడిన జనులు చప్పట్లు కొట్టడం మరిచిపొయ్యారు. ఎవరేనా చెప్తేనేగాని జనం ఏదీ చెయ్యరు. యువకుడు వంతెనమీదుగా వెళుతున్నాడు. వంతెన మీద జనప్రవాహం, వంతెనకింద జలప్రవాహం. యువకుడు రాకపోకలు ఆపేశాడు. వంతెనకి సాష్టాంగపడి ప్రాణదానం చేసినందుకు ప్రణామం ఆచరించాడు. లేచాడు. అందరివైపూ తిరిగి 'నన్ను చూసి నవ్వండి' అన్నాడు. జనం నవ్వారు. యువకుడు సాగిపొయ్యాడు. ఆరుద్ర