
MAA MANCHI TELUGU KATHA
₹100
In stock · 81 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గోపీచంద్ ఆపద్బాంధవ్యాలు! మనిషికి ఉండే మూడు ముఖ్యమైన అవలక్షణాలను చెప్పమంటే- సందేహించకుండా స్వారం, అవకాశవాదం, అహంభావం అని చెప్పవచ్చు. వీటిలో అహంభావం మనిషికీ, మనిషికి మధ్య అడ్డుగోడలు కడుతుంది, కులం, మతం, ఉద్యోగపు హోదా, ఐశ్వర్యం, పాండిత్యం యిట్లాంటి వాటిని జ్ఞాపకం చేస్తూ "నువ్వు నీ పక్కవాడికంటే అధికుడవు సుమా' అని చెవిలో రొద పెడుతూ ఉంటుంది. అందుకే "అందరూ ఒక్కటే" అనే మాట సాధారణంగా పెదిమల దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. అయితే - ఏవో అనుకోని పరిస్థితులు ఎదురై, ఒక గొప్ప ప్రమాదంలో మనుషులు ఇరుక్కున్నప్పుడు ఈ కులం, మతం, ఐశ్వర్యం, వగైరాలేవీ అడుగోడలుగా నిలబడవు. అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి. అయితే, ఆ గండం గడిచిపోయాక పరిస్థితి తిరిగి మామూలే! ఎవరి గదుల్లో వారే తలుపులు బిడాయించుకు కూర్చుంటారు. మనిషి మనస్తత్వాన్ని కథల్లో ఆవిష్కరించదలచుకున్న కథకులకు ఈ విచిత్ర ప్రవృత్తి ఎన్ని ఇతివృత్తాలనయినా సమకూరుస్తుంది. ప్రఖ్యాత కథకుడు గోపీచంద్ (1910-1962) రచించిన కథలో కూడా ఇలాంటి ఇతివృత్తంతో ఉన్న కథ ఉంది. ఈ కథ పేరు 'ఆపద్బాంధవ్యం'. గోపీచంద్ పేరు చెప్పేసరికి సాహిత్యాభిమానులకు తెలుగు వారు సగర్వంగా చెప్పుకోదగ్గ 'అసమర్థుని జీవయాత్ర', 'మెరుపుల మరకలు' వంటి ప్రసిద్ధ నవలలు జ్ఞాపకానికి వస్తాయి. అంతేకాదు, ఆయన రాసిన తత్వశాస్త్ర వ్యాసాలు, గ్రంథాలు, మరపురాని కథలు యిలా ఎన్నో మనోవీధిలో మెదలుతాయి. మహాకవి ఆరుద్ర అన్నట్లు తెలుగు సాహితీ ప్రపంచానికి 'ఎడద, మెదడుల విందు చేసిన' గొప్ప రచయిత గోపీచంద్. ఈ కథలో చలపతిరావు అనే విద్యావంతుడైన నిరుద్యోగికి ఢిల్లీలో ఆఫీసరు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తుంది. కాని ఇంటర్వ్యూకి హాజరు కావడానికి వ్యవధి తక్కువగా వున్నందున - రైల్లో అయితే సమయానికి చేరుకోలేనేమో ననే భయంతో విమానంలో వెడదామనుకుంటాడు. అలా అని మన కథానాయకుడు విమానాల్లో తిరిగే వాడేమీకాదు. అతి సామాన్యమైన కుటుంబానికి చెందినవాడు. తండ్రి చనిపోయిన కారణంగా - ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. మిత్రుడి దగ్గిర అప్పు తీసుకుని అతడు ఈ ప్రయాణం చేస్తున్నాడు. కొన్ని మినహాయింపులు వదిలేస్తే విమానాల్లో ప్రయాణాలు చేసేవారిలో ధనికులు, పెద్ద ఉద్యోగస్తులు మాత్రమే సాధారణంగా వుంటారు. ఈ విమానం పరిస్థితీ అంతే. ఖరీదయిన సూట్లు వేసుకున్న పెద్ద అధికారుల మధ్య బిక్కు బిక్కుమంటూ మన కథానాయకుడు విమానం ఎక్కాడు. అతడి పక్కన ధనవంతురాలయిన ఓ అందాల యువతి కూర్చుంది. తన పక్కన యిలాంటి 'మానవుడు' వున్నందుకు చిరాకుతో కూడిన ఓ చూపు ప్రసరించి ఆమె ముఖం తిప్పుకుంది! అలాంటి అమ్మాయి పక్కన కూర్చుని ప్రయాణం చేస్తున్నందుకు అతడు 'థ్రిల్' అనుభవించాడు కానీ, దానిని ప్రదర్శించే అవకాశమూ, సాహసము అతడికి లేవు.