
MAA PENUGONDA KATHALU
₹250
In stock · 22 available
PublisherM.R.V.SATYANARAYANA MURTHY
LanguageTelugu
① 1 నవరాత్రి ముచ్చట్లు మా పెనుగొండ, విజ్జేశ్వరం-సర్సాపురం కాలువ వడ్డునే వయ్యారాలు పోతూ పడుకున్న 'వనకన్య'లా కిలోమీటర్ మేర ఉంటుంది. పది రైస్ మిల్లులు, రెండు పౌండ్రీలతో నిత్యం అందులో పనిచేసే కార్మికులతో ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. మూడువేల సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం, క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి దేవాలయం మా ఊరికి ఎంతో కీర్తి తెచ్చాయని మా ఊరి పెద్దాయన సూర్యనారాయణ పంతులు గారు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత కోమట్ల ఇంట్లో పుట్టిన వాసవి కన్యకాపరమేశ్వరి వలన మా ఊరు మరింతగా ప్రఖ్యాతి చెందింది. మా ఊర్లో కుర్రకారుకి దేవీ నవరాత్రులు వచ్చాయంటే బోల్డు హడావిడి. పెద్దోళ్ళు అందరూ శివాలయంలో, మహిషాసురమర్ధనీ అమ్మవారికి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేయించుకుంటారు. రాత్రి ఎనిమిది గంటలకు ప్రసాదాలు పెడతారు. ఆడపిల్లలు అందరూ గుడికి వచ్చి, దాగుడు మూతలు ఆడుకుంటారు. ఆళ్ళని చూడటానికి, వీలైతే ఓ మాట కలపడానికి కుర్రకారు, బెల్లం జీడి చుట్టూ మూగే ఈగల్లా వాలిపోతారు. నగరేశ్వర స్వామి గుడి ఏభై స్తంభాలతో చూడ ముచ్చటగా ఉంటుంది. నవరాత్రులు తొమ్మిది రోజులూ, పూజలూ, అభిషేకాలూ ఉంటాయి. ఆటితో పాటు జగన్నాథపురం సుబ్బారాయుడు గారు చేసే లింగార్చన మా పిల్లకాయలకు చాలా విచిత్రంగా ఉండేది. కాలువలోంచి మట్టిముద్ద తెచ్చి అంగుళం సైజులతో చిన్న చిన్న స్తంభాలలా చేసి, ఒకో స్తంభానికి ఒకో బియ్యపు గింజ అద్ది నిలబెట్టేవోరు పంతులుగారు. చుట్టూ గుడి కట్టి అందులో శివలింగం ఉండేటట్లు మంత్రాలు చదువుతూ పేర్చేవారు. మొత్తం అంతా పూర్తి అయ్యాకా ఆ శివలింగాన్ని పువ్వులతో పూజ చేసేవారు. ఇదంతా అయ్యేసరికి మూడు గంటలు పట్టేది. ఆ తర్వాత తీర్థం ఇచ్చి, చిన్న చిన్న పటిక బెల్లం ముక్కలు ప్రసాదంగా పెట్టేవారు. ప్రసాదం కోసం కాకుండా, ఆయన ఆ మట్టిస్తంభాలతో కట్టే శివలింగం చూడటానికి నేనూ, హరనాధ్, గాంధీ, సుధాకర్ రోజు పొద్దున్నే గుడికి వెళ్లే వాళ్లం. మా పెనుగొండ కథలు * ఎమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి