MAHARANI RUDRAMADEVI - PADYA KAVYAM by VAVILALA NARASIMHARAO Telugu book cover

MAHARANI RUDRAMADEVI - PADYA KAVYAM

by VAVILALA NARASIMHARAO

₹125
In stock · 12 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
రచయిత - రచన - వావిలాల సుబ్బారావు శ్రీ వావిలాల నరసింహారావు గారు లోకం ఎరిగిన కవి కాదు. లోకాన్ని గూడ అంతగా ఎరిగిన లౌకికుడు కాదు. కనుక మా నాన్నను గురించి కొంతయినా పరిచయం చేయటం నాకు భక్తితో కూడిన తాత్పర్యం. తాను ఉన్నంతకాలం తన రచనలను అచ్చు వేసుకొనే ఆసక్తి చూపలేదు. ఆ విషయం ఎవరు ప్రస్తావించినా "నా సంతోషం కోసం వ్రాసుకున్నాను. ఆసక్తిగల మిత్రులకు వినిపిస్తాను. అది చాలు. అచ్చు వేయటాలు, అమ్ముకోవటాలు.. ఎందుకిదంతా..” అనేవారు. కీర్తి పరాఙ్ముఖుడు. కవితా జీవితమే కాదు. నిత్యజీవితం కూడ అట్లాగే అంతర్ముఖంగా గడిపారు. నాన్న 1909లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గరగల కొమిరెపూడి గ్రామంలో జన్మించారు. వావిలాల యింటి పేరుగల కుటుంబాల కుదురులు చాలా ఉన్నాయి. వారి మధ్య ఇపుడు జ్ఞాతి సంబంధాలు లేవు. నరసరావుపేటకు సమీపంలో గల 'కండ్లగుంట' మా కుటుంబాల కుదురు. మా తాతగారు శ్రీ వావిలాల పరమయ్యగారు కొమిరెపూడిలోని 'పున్నావఝుల' వారి యింటికి ఇల్లరికం వచ్చాడు. కొమిరెపూడిలోనే ఉన్న, మా నాన్నగారి పెత్తల్లి కుమారుడయిన శ్రీ బొడ్డుపల్లి వీరభద్రయ్య గారితో సాహచర్యంవల్ల నాన్నకు సాహిత్య అభిలాష కలిగింది. మా కుదురులో సాహిత్యాభిలాష నాన్నగారితోనే ప్రారంభం. (సుప్రసిద్ధ కవి రాజమహేంద్రవర కవిత్రయంలో ఒకరుగా పిలువబడే వావిలాల వాసుదేవశాస్త్రిగారు; అలనాటి కృష్ణా జిల్లా జడ్జిగా ఉండి, అద్వైత శాస్త్ర గ్రంథాలు వ్రాసిన తాత్వికుడు శ్రీ వావిలాల శివావధానులు గార్లు, గుంటూరు జిల్లాకే చెందిన భిన్నమయిన వావిలాల శాఖల వారు గోత్రాలు మాత్రం ఒకటే). మా కుదురులోని తక్కిన సభ్యులకు వైదిక, పురాణ పరిజ్ఞానాలే గాని సాహిత్య వ్యాసంగం లేదు. బొడ్డుపల్లి వీరభద్రయ్య గారు ఫిరంగిపురం లోని మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయుడు. మధ్వశ్రీ కాశీకృష్ణాచార్యులుగారి కుమారుడు, సంస్కృత పండితుడు, అయిన కాశీ వ్యాసాచార్యులు గారు గూడ అక్కడ ఉపాధ్యాయుడే వారిద్దరు మంచిమిత్రులు. వారి అంతేవాసిగా నాన్న సాహిత్యాభిరుచి మెరుగులు దిద్దుకున్నది.