MAHI NOVEL by KUPPILI PADMA Telugu book cover

MAHI NOVEL

by KUPPILI PADMA

₹120
In stock · 1 available
PublisherKUPPILI PADMA
LanguageTelugu
అప్పుడే వేడెక్కుతున్న ఫాల్గుణమానవు మధ్యాహ్నపు యెండలోంచి తెరచి వున్న వాకిలి గుమ్మంలోంచి ఫ్యాన్ తిరుగుతున్న హాల్లోకి వుత్సాహపు గాలిలా వస్తూ, "మమ్మీ... వుద్యోగం వచ్చేసిందోచ్," అంటూ తన మెడ చుట్టూ చేతులేసి తనని చుట్టేసిన కూతురిని విడిపించుకొంటూ, "నా మెడ... అబ్బా... వుండవే... యేం వుద్యోగమో యేమో... నా ప్రాణం మీదకొచ్చింది. యేయ్... ఆగు," అంటూ నందన నుంచి తనను తాను విడిపించుకొంటూ, 'హా' అంటూ నోటితో గాలి పీల్చుకొంటూ, “యేంటా గోల... కుదురుగా చెప్ప లేవ్," అంది మాధవి. “యేంటి కుదురుగా చెప్పేది, యిమోషన్స్ గై... ఆ... మమ్మీ వుద్యోగం వచ్చింది అంటూ కాళ్ళకి దండం పెట్టాలా... వోల్డ్ పిక్చర్లోలా... వోల్డ్ మమ్మీ..." అని నాలుక బయటపెట్టి నవ్వుతూ వెక్కిరించి అటూ యిటూ చూసి టి.వి. చానల్ మారుస్తూ క్షణంలో సుడిగాలిలా తిరిగి తల్లిని చుట్టేసి, “యూ నో... నేనిప్పుడు వుద్యోగస్థురాల్ని." అని గట్టిగా అంటుంటే, "నందూ... రా... రా... ముందీ హారతి తీసుకో..." అంటూ వంటింట్లోంచి హారతి పళ్ళంతో హాల్లోకి వస్తూ ఫ్యాన్ ఆపి, "రా... రా..." అన్నారు వైదేహి. "హాయ్ గ్రానీ,” అంటూ హారతిని వొద్దికగా కళ్ళకి అద్దుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్ళు మూసుకొని మెల్లగా తెరిచింది నందన. “నీకు యింటర్వ్యూ వుందని వుదయమే పూజ చేసిందా, హారతిచ్చి పంపిందా. నువ్వు వెళ్ళినప్పట్నుంచి అమ్మమ్మ దేవుడి ముందే కూర్చుని లలితా సహస్రనామాలు చదువుతూనే వుంది," అంది మాధవి. “ప్రసాదం తీసుకో,” అన్నారు వైదేహి. ప్రసాదం పళ్ళెం దేవుడి దగ్గర తిరిగి పెట్టేస్తూ, “అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి యిలా దేవుడి దగ్గర పెట్టు," అన్నారామె. "ఆర్డర్ యేదీ," అడిగింది మాధవి. "ఆర్డర్ యింకా యివ్వలేదు. యిస్తారు," అంది నందన.