MAYAMAHAL by VIDWAN CHOPPA VEERABHADRAPPA Telugu book cover

MAYAMAHAL

by VIDWAN CHOPPA VEERABHADRAPPA

₹70
In stock · 607 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మాయామహల్ విజయేంద్ర వర్మ. పాతిక సంవత్సరాల వయస్సున్న యువరాజు. త్వరలో తన రాజ్యానికి తండ్రికి వారసుడిగా మహారాజుగా పట్టాభిషిక్తుడు కావలసినవాడు. అయితే ఆరు నెలల క్రితం ఆయన తండ్రిగారు మహేంద్ర వర్మ రాజ్యం పొలిమేరల్లో సందర్శనకు వెళ్లి ఇక కనిపించకుండా పోయారు. మహేంద్ర వర్మ గురించి కొడుకే కాకుండా, తమ్ముడు రుద్ర భూపతీ, రాజ్య ప్రజలూ వెతుకుతూనే ఉన్నారు. మహేంద్ర వర్మ కనిపించలేదు. ప్రాణాలతో ఉండి వుంటే ఆయన ఈ పాటికే కనిపించి ఉండేవాడని కొంతమంది అభిప్రాయపడ్డారు. తన తండ్రి ప్రాణాలతో ఉండి వుండడన్న ఆలోచనే ఆ రాజకుమారుడిని విపరీతంగా వేధిస్తోంది. దుఃఖం అతడిని వివశుడిని చేస్తోంది. తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు విజయేంద్ర వర్మ. తండ్రి లాలనలో తల్లి లేదన్న బెంగ అతడికి కలగలేదు. అంతఃపుర జనమంతా కలసి అతడిని అల్లారుముద్దుగా చూసుకుంటూ వచ్చారు. పట్టాభిషేకం చేసి కొడుకును చక్రవర్తిగా చూడాలనుకుంటూన్న శుభ సమయంలోనే మహారాజు అదృశ్యం కావడమేమిటి? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? అసలు తండ్రికి ఏమయ్యింది? ఆయనకు శత్రువులున్నారా? బాబాయి రుద్ర భూపతి వద్ద ఇన్ని నెలల నుండి విజయేంద్ర తన ఆవేదన వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అన్నగారి కొడుకును ఆయన ఓదార్చుతూనే ఉన్నాడు. పినతల్లి సరే సరి. "పినతండ్రిగారి చేతుల మీదనైనా నీ పట్టాభిషేక మహోత్సవం జరుపుకొంటే కొంతలో కొంత మా వంటి వారికి ఉపశమనం దక్కినట్టవుతుంది" అంది పినతల్లి. ఇదే అభిప్రాయాన్ని ఆమె ఇంతవరకూ ఎన్నోసార్లు వ్యక్తపరచింది. అన్నిసార్లూ విజయేంద్ర మృదువుగా తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో తన పినతండ్రి కూడా వారి ప్రక్కనే ఉండేవాడు.