
MODI INDIALO SUPREME COURT
by MALUPU BOOKS
₹75
In stock · 12 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076398
ప్రజాస్వామ్య సౌధాన్ని నిటారుగా, సగర్వంగా నిలబెట్టవలసిన నాలుగు స్తంభాలలో క్రమంగా శిధిలమౌతున్నప్పటికీ ఒక మోస్తరు బలంగా కనిపిస్తున్నది న్యాయవ్యవస్థే. చట్టసభలలో రచ్చ మాత్రమే జరుగుతున్నది. కఠోరమైన, ప్రజావ్యతిరేక చట్టాలు మందబలంతో నిర్నిరోధంగా ఆమోదం పొందుతున్నాయి. పరిపాలన వ్యవస్థ అధినాయకుడికి 'జీహుజూర్' అంటున్నది. మీడియా సంగతి సరేసరి. మిగిలింది న్యాయవ్యవస్థ ఒక్కటే. ఇందిరాగాంధీలాగా నరేంద్రమోదీ ఆత్యయిక పరిస్థితిని ప్రకటించ లేదు. కానీ అంతకంటే నిరంకుశంగా అసమ్మతిని అణచివేస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో కరడుగట్టిన నియంతలా వ్యవహరిస్తున్నారు. మతం పేరుతో సమాజాన్ని చీల్చుతున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికీ కొన్ని తీర్పులతో ఊరట కలిగిస్తూ, మరికొన్ని తీర్పులతో నిరాశ కలిగిస్తూ దేశంలో ప్రజాస్వామ్యవాదులను అశాంతికి, అనిశ్చితికీ గురి చేస్తోంది. న్యాయమూర్తులు వాదనలు విని తమకు న్యాయమని తోచిన తీర్పులు ఇవ్వడం, వాటిలో కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా రావడం, కొన్ని వ్యతిరేకంగా పోవడం సమంజసమే. కానీ న్యాయమూర్తులు దేశాధినేతల భావజాలాన్ని ఆమోదించి, రక్తగతం చేసుకొని, దాన్ని తమ తీర్పులలో ప్రతిబింబిస్తేనే ప్రమాదం. ఇప్పుడు ఆ ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. గుజరాత్ అల్లర్లు, రామజన్మభూమి వివాదం వంటి కేసులలో అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరూ, మోదీకీ, ఆయన సర్కారుకూ అనుకూలంగా తీర్పు చెప్పిన వారికి రాజ్యసభ సభ్యత్వం, గవర్నర్ వంటి పదవులు ఇచ్చి సత్కరించడం న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో విశ్వాసం సడలించే అవాంఛనీయ పరిణామాలు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఆ కేసు పరిష్కరించడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందనే ప్రశ్న అడగవలసి ఉంటుంది. కశ్మీర్ నుంచి దాఖలైన హెబియస్ కార్పస్ పిటీషన్లను ఎందుకు విచారణకు స్వీకరించరు? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఎందుకుంటున్నాయి? అత్యున్నత న్యాయస్థానం తీర్పులను క్షుణ్ణంగా, వస్తునిష్టంగా పరిశీలించడం, న్యాయమూర్తుల నిర్ణయాలను ప్రశ్నించడం అత్యవసరం. ఈ పని నందినీ సుందర్ ఈ పుస్తకంలో అద్భుతంగా చేశారు. నందినీ సుందర్ వంటి రచయితలూ, సెతల్వాద్ వంటి పౌరహక్కుల నేతలూ, సంజయ్ భట్ వంటి పోలీసు అధికారులూ, రవీష్ కుమార్ వంటి జర్నలిస్టులూ, ప్రశాంతభూషణ్ వంటి న్యాయవాదులూ ఎన్ని అవరోధాలు ఎదురైనా నిర్భయంగా ప్రాథమిక హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం అహరహం పోరాడుతున్నారు. కనుకనే దేశంలో ప్రజాస్వామ్యం ఈ మాత్రమైనా ఉంది. ప్రజాస్వామ్య ప్రియులందరూ ఈ విలువైన పుస్తకాన్ని విధిగా చదవాలి.