
NAA ANTARANGA KATHANAM
by BUCHI BABU
₹70
In stock · 525 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నా అంతరంగ కథనం దానికీ దీనికీ ఏ సంబంధం లేకపోయినా మొదటి ప్రపంచ సంగ్రామం మధ్యలో ఏలూరులో నేను పుట్టినట్లు చెపుతుంది అమ్మమ్మ. ప్రపంచ సంగ్రామానికీ నా జననానికీ ఏ సంబంధమూలేదని పూర్తిగావొప్పుకోలేను. యుద్ధం అంటే భయం నాకు. యుద్ధానికి వెళ్ళిన సైనికుడంటే హడలు. నలుగురుచేరి బిగ్గరగా తగవులాడుతుంటే అక్కడి నుంచి పారిపోతాను నేను. పెద్ద చప్పుడుకి తట్టుకోలేను. మోతగా తలుపులు మూసి గడియేసినా, ట్రంకు పెట్టెమూత దబ్బున మూసినా, హోటల్లో తిన్నతర్వాత కప్పులూ ప్లేట్లూ చప్పుడు చేస్తూ తీసినా, లారీ వేగంగా వెళ్ళినా, ఎవరైనా పనివాళ్ళని కూకలేసినా బాధపడతాను. యుద్ధం అంటే చప్పుడు. ప్రపంచయుద్ధం మధ్యలో పుట్టాను గనుక నాకు' యుద్ధాలంటే భయం. చప్పుడంటేనే భయం అని కాదు. యుద్ధంలో హతమయ్యే సైనికులు ధరించే దుస్తులంటేకూడా రోత. ఆ ఖాకీలాగు, చొక్కా, ఆ టోపీ, ఆ బెల్టు, ఆ జోళ్ళు యివేవీ గిట్టవు. ఒకేరకం దుస్తులు (Uniform) ధరించిన గుంపులంటే ఏవగింపు. పోలీసులు, నిప్పులార్పేవాళ్ళు, హాస్పిటల్స్లో నర్సులు, రైల్వేగార్డులూ వీరంతా ఒకేరకం దుస్తులు ధరిస్తారు. ఈ దుస్తుల మధ్య నేనెరుగున్న మనుషులున్నారని నమ్మలేను. ఫుట్బాల్ ఆటగాళ్ళ గ్రూప్ ఫోటోలో వ్యక్తులు కనబడరు. స్కౌట్ల బృందంలో యువకుడు కనబడడు. రెండు మూడు నెలలు స్కౌట్గా వుండి మానుకున్నాను. స్కూల్లో ఆ దుస్తులు వేసుకొని తీరాలన్న నిబంధనపట్ల నిరసన ప్రకటిస్తూ ఒకేరకం వేషధారణపట్ల నిరసన చూపడంలో ఏదో ఆధిక్యత వుందని చెప్పడంలేదు. అట్లాంటి మనస్తత్వం ఏర్పడింది. అంతే. యుద్ధం మధ్యన పుట్టడంవల్ల అల్లాంటి మనస్తత్వం ఏర్పడిందా? చనిపోయిన వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడు అన్న సిద్ధాంతంపట్ల నాకు నమ్మకం లేదు. కాని యుద్ధంలో సైనికుడిగా చనిపోయి, మళ్ళా పుట్టడంవల్ల యుద్ధంపట్ల అసహనం ఏర్పడిందని అనుకునేవాడిని మొదట్లో. రోము, గ్రీకు నాగరికతల ఉదంతం చదివినప్పుడు నా కవన్నీ తెలిసినట్టు, ఆ కాలాలలో నే వున్నట్లు అనిపించేది. ఫ్రెంచి విప్లవంలో పాలకులను హతమార్చిన దుండగులలో నేనొకణ్ణి. ఫ్రెంచి విప్లవాన్ని ఖండిస్తూ ఎడ్మండ్బర్క్ వ్రాసిన గ్రంథంలో మొదటి రెండు మూడు పుటలు చదవగానే అర్థమైపోయినట్లనిపించేది. అలెగ్జాండర్ ఇండియా రావడం నే నెరుగుదును. ఎల్లోరా శిల్పుల జట్టులో నేనొకణ్ణి. శాంతిసందేశం ప్రచారం చేసిన అశోకుణ్ణి వెక్కిరించిన ముఠాలో నేనూ వున్నాను. నా అంతరంగ కథనం