
NAGANANDAM - MYTHOLOGICAL FANTASY THRILLER
by VAKKANTHAM SURYANARAYANA RAO
₹300
In stock · 60 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789347318160
నాగానందం శ్రీమహావిష్ణువు మహాలక్ష్మివైపు సాభిప్రాయంగా చూశాడు. మహాలక్ష్మి నిర్వికారంగా పతిదేవుడి పాదాలు ఒత్తుతోంది. అరమూసిన కళ్ళు ఆయన పాదాలనే చూస్తున్నాయి. విష్ణువు కనుబొమలు ఏదో సందేహాన్ని చిత్రీకరిస్తూ దగ్గరగా చేరాయి. ఆయన శరీరం కదిలింది. పాదాలు మహాలక్ష్మి హస్తాల క్రిందినుండీ జారాయి. విష్ణువు శేషతల్పం మీద లేచి కూర్చున్నాడు. శయనభంగిమను భంగం చేసిన పతిదేవుడి వైపు మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. ఆమె విశాల నేత్రాలు మరింత విశాలంగా విచ్చుకున్నాయి. విష్ణువు అర్ధాంగ లక్ష్మివైపు తలతిప్పి చూశాడు. “దేవీ, పానుపుగా ఉన్న ఆదిశేషుడు ఎందుకో అసహనంగా కదులుతున్నాడు! గమనించావా?" "లేదు. నా దృష్టి, ఆలోచనా అన్నీ తమ పాదాల మీదే ఉన్నాయి..." విష్ణువు తలపంకించాడు. "ఆదిశేషుడి శారీరక స్పందన మా విశ్రాంతికి భంగం కలిగిస్తోంది." "శేషుడి స్పందన ఎందుకో?” మహాలక్ష్మి సందేహం వ్యక్తం చేసింది. "చూద్దాం! శేషుడే చెప్పాలి!" విష్ణువు సాలోచనగా అన్నాడు. అవునన్నట్టు మహాలక్ష్మి తల ఊపింది. "శేషా!" విష్ణువు కంఠధ్వని మందిరంలో మారు మ్రోగింది. మరుక్షణం పానుపు ప్రకంపన ఆగింది! ఆది శేషుడు తన ప్రభువు ముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు.