NEETI PUTTA by SALEEM Telugu book cover

NEETI PUTTA

by SALEEM

₹150
In stock · 50 available
PublisherSALEEM
LanguageTelugu
గరిమనాభి ఉదయం ఏడయినా మంచం మీదనుంచి దిగాలనిపించటం లేదు. వళ్ళంతా సుత్తితో చితక్కొట్టినట్టు నొప్పులు. జ్వరం వచ్చిందేమో. తలనొప్పిగా కూడా ఉంది. కళ్ళు మండుతున్నాయి. హాల్లోంచి వస్తున్న శబ్దాలకి కళ్ళు బలవంతంగా విప్పి చూశాను. ఆయన లేచి, బ్రష్ చేసుకుని పేపర్ చదువుతున్నట్టున్నారు. పేజీ తిరగేస్తున్న శబ్దం... మధ్య మధ్యలో కోరస్ గా ఆయన దగ్గు విన్పిస్తున్నాయి. ఆయనకు డయాబెటీస్ ఉన్న విషయం గుర్తొచ్చి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూచున్నాను. బాత్రూంకెళ్ళి వేడినీళ్ళతో మొహం కడుక్కున్నాను. వంటగదిలోకి దూరి ఒక పొయ్యి మీద పాలు కాగడానికిబెట్టి మరో దానిమీద ఉప్మా చేశాను. ప్లేట్లో ఉప్మాతో పాటు ధనియాల కారప్పొడి వేసి ఆయన ముందు పెట్టాను. ఆయన తినడం మొదలెట్టాక వంట గదిలోకెళ్ళి కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి ఆయన ముందున్న టీపాయ్ మీద ఒక కప్పు పెట్టి దానిమీద సాసర్ తో మూత పెట్టాను. ఆయన పక్కనున్న సోఫాలో కూలబడి మెల్లగా కాఫీ తాగడం మొదలెట్టాను. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ప్రాణానికి హాయిగా అన్పించింది. టిఫిన్ తిని ప్లేట్లో చేయి కడుక్కున్నాక ఆయన కాఫీ కప్పుని అందుకుని తాగబోతూ పెద్దగా దగ్గారు. "ఈ దగ్గు చంపేస్తోంది కస్తూరీ... రాత్రంతా దీనివల్ల కలత నిద్రే. గుండెల నిండా కఫం పేరుకు పోయినట్టుంది" అన్నారాయన.