
NIVURU
by NIJAM
₹125
In stock · 27 available
PublisherG.SREERAMA MURTHY
LanguageTelugu
నిష్ఠుర నిజాల నిప్పులీ జనపదాలు! నలబై ఏళ్ల తర్వాత కవిత్వం పుస్తకం వేస్తున్న శ్రీరామమూర్తి గారి కవిత్వం గురించి చెప్పబోయే ముందు వ్యక్తిగా ఆయన గురించీ, ఆయనతో నా సంబంధం గురించీ చెప్పాలి. విరసం పుట్టి, సృజన ఆధునిక సాహిత్య వేదిక విప్లవ సాహిత్యానికి చిరునామాగా మారినప్పటి నుంచీ, దాదాపు పదో ఏటి నుంచీ, పుస్తకాల అమ్మకాలలో సహకరించే పనిలో ఉన్నాను. పన్నెండేళ్లు దాటి, ఎనిమిదో తరగతికి హనుమకొండకు వచ్చేటప్పటికి ప్రతి సభ దగ్గరా పుస్తకాలు పరుచుకుని కూచుని అమ్మడం, సృజన దగ్గరికే వచ్చేవారికి పుస్తకాలు చూపించడం, అమ్మడం దాదాపుగా నా బాధ్యతలు అయ్యాయి. అప్పుడు, నా పదమూడో ఏట, నాచేతికి వచ్చింది విజయవాడ విరసం యూనిట్ ప్రచురించిన 'ఎర్రమందారాలు' అనే చిన్న కవితలు పుస్తకం. కవి పేరు 'నిజం'. తెల్లని తెలుపు నేపథ్యంలో మంచి ఎరుపు ముద్దమందారాల రేఖాచిత్రాలు. ఆ ఆకర్షణీయమైన ముఖచిత్రం వల్ల కావచ్చు, ఆసక్తిదాయకమైన శీర్షిక, కలం పేరు వల్ల కావచ్చు. ఆ గీతాల తూగు వల్ల కావచ్చు, ఆ వయసు వల్ల కావచ్చు, ఆ కవిత్వం, ఆ కవి నా మనసు నిండారు. తర్వాత కొన్నాళ్లకే కవి పేరు, వివరాలు తెలిశాయి. 'నిజం' ఆయన కలం పేరని, ఆయన పేరు శ్రీరామమూర్తి అని, శ్రీకాకుళం వారని, ఐవి సాంబశివరావుకు సన్నిహితులని, బెజవాడలో పెద్ద అనారోగ్యం బారిన పడితే ఐవి శుశ్రూషతో తేరుకున్నారని అలా ఎన్నెన్నో... కవిగా 'నిజం' పట్ల ఏర్పడిన అభిమానం ఐవి మీద ప్రేమతో కలిసి ఇనుమడించింది. ఈ లోగా ఎమర్జెన్సీ వచ్చి ఆ వాతావరణం మారిపోయింది. పుస్తకాలు లేవు. ఎర్రపుస్తకాలూ ఎర్రట్టల పుస్తకాలూ లేవు. పుస్తకాలు బైటికి చదువుకోవడం, అమ్మడం, ప్రచారం చేయడం నిషిద్ధం. ఎమర్జెన్సీ తర్వాత ఒక వివాదంతో మళ్లీ 'నిజం' సృజన పరిచయంలోకి వచ్చారు. 1980లో దేశాన్నంతా కలవరపరిచిన, ఆందోళనపరచిన భయానకమైన ఘటన భాగల్పూర్ ఖైదీల కళ్లు పొడిచేసిన పోలీసుల క్రౌర్యం. అప్పటికింకా రంగుల టెలివిజన్ లేదు, నలుపు తెలుపు టెలివిజన్ కూడ ఎక్కడో తప్ప ఉండేది కాదు. అందువల్ల ఆ దుర్మార్గం బైటికి వచ్చినది ప్రధానంగా వార్తాపత్రికల ద్వారానే, భాగల్పూర్ పోలీసులు ముప్పైకి పైగా ఖైదీల కళ్లలో ఆసిడ్ చల్లి ఎట్లా వారిని అంధులుగా మార్చారో ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక, సండే వారపత్రిక చాల వివరంగా రాశాయి. అప్పటికి శ్రీరామమూర్తి గారు హైదరాబాదులో ఆంధ్రప్రభలో పని చేస్తున్నారనుకుంటాను.