
OKA CHALANAM OKA JWALANAM
₹125
In stock · 12 available
PublisherDR.KUTIKUPPALA SURYARAO
LanguageTelugu
ఇరవైయ్యేళ్ల కిందట.. దగ్గరదగ్గిర ఇరవైయ్యేళ్లు అయిఉంటుందేమో.. డాక్టర్ కూటికుప్పల సూర్యారావుగారు పరిచయమై.. అది కూడా విలేకరిగా.. ఒకానొక స్టోరీ కోసం.. "విశాఖపట్నంలో విస్తరిస్తున్న ఎయిడ్స్ భూతం" వంటి వ్యాసకథనం రాయాలని, మరునాడు ఉదయాన్నే పంపించాలని హైదరాబాద్ లోని ఆఫీసు పెద్దలు అప్పట్లో కోరారు. పాత్రికేయునిగా నాకది ఇంకా కొంచెం కొత్త కాలమే. చోడవరం వంటి పల్లెటూరి నుంచి వచ్చినవాణ్ణి. వైజాగ్ వాతావరణం పూర్తిగా తెలియనివాణ్ణి. ఈ అసైన్మెంటును ఎలా పూర్తి చెయ్యాలో బెంగపడుతున్న తరుణంలో నా ఆప్తబంధువు భీశెట్టి వెంకట (బీవీ) అప్పారావు దేవుళ్లా కనిపించాడు. అప్పుడు సెల్ఫోన్లు గట్రా.. గట్రా.. లేవు. సాయంకాలం ఏదో సాహితీ సమావేశానికి హడావుడిగా వెళుతున్నాడు బీవీ. స్కూటర్ ఆపమన్నాను. సంగతి చెప్పాను. "ఓన్.. ఇంతేనా.. డాక్టర్ గారిని కలిసింది... ఆయనుండగా మనకెందుకు బెంగ.." అన్నాడాయన. అడ్రస్ చెప్పాడు. ల్యాండ్ లైన్ నెంబర్ రాసిచ్చాడు. వెంటనే డాక్టర్గారికి ఫోన్ చేశాను. "ఉదయాన్నే వచ్చేయండి మా ఇంటికి" అన్నారాయన చాలా ప్రేమగా, బెంగ తీరిపోయింది. హమ్మయ్య అనుకున్నాను. వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్సు దరిదాపుల్లో ఒకరి ఇంట అద్దెగదిలో ఉండేనేను నా డొక్కు లూనామీద మురళీనగర్లోని కూటికుప్పల ఇంటికి బయలుదేరాను. నా దశ ఎలా ఉందో గానీ, లూనా సర్రున స్టార్ట్ కాగానే వాన జర్రున మొదలైంది. అప్పటి వరకూ లేని మేఘాలు ఎక్కడెక్కడినుంచో వచ్చి ఆకాశం కొమ్మమీద వాలిపోయి నా మీద కక్ష తీర్చుకుంటున్నట్టుగా కురిశాయి. నాకయితే ఏడుపొక్కటే తక్కువ.